Let's talk: editor@tmv.in
విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీని సందర్శించిన పార్లమెంటరీ కమిటీ

విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీని సందర్శించిన పార్లమెంటరీ కమిటీ

Dantu Vijaya Lakshmi Prasanna
22 జనవరి, 2026

దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంపొందించే దిశగా జరుగుతున్న కృషిని పరిశీలించేందుకు, రక్షణ శాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబొరేటరీ ని సందర్శించింది. సీనియర్ నేత రాధా మోహన్ సింగ్ నేతృత్వంలోని ఈ బృందం, భారత నౌకాదళానికి అవసరమైన అధునాతన అండర్ వాటర్ ఆయుధాలు, సాంకేతికతలను సమీక్షించింది.

ప్రధాన ఆయుధాల ప్రదర్శన, సాంకేతికత

ఈ పర్యటనలో భాగంగా ఎన్ఎస్‌టీఎల్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అనేక కీలక ఆయుధాలను కమిటీకి ప్రదర్శించారు.

ఇందులో ముఖ్యమైనది వరుణాస్త్ర, ఇది భారతదేశం గర్వించదగ్గ హెవీ వెయిట్ యాంటీ సబ్‌మెరైన్ టార్పెడో. శత్రు జలాంతర్గాములను నీటి అడుగున వేటాడడంలో ఇది అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

అనంతరం అక్కడి అధికారులు తేలికపాటి టార్పెడోలు, ఎలక్ట్రిక్ హెవీ వెయిట్ టార్పెడోలు అత్యాధునిక అండర్ వాటర్ గనులను గురించి కమిటీకి వివరించారు. అలాగే స్మార్ట్ ని పరిచయం చేశారు. ఇది లాంగ్ రేంజ్ సబ్‌మెరైన్ వ్యతిరేక పోరాటంలో గేమ్ ఛేంజర్ లాంటి సాంకేతికత.

కాగా, నీటి అడుగున మనుషులు లేకుండా పనిచేసే స్వయంప్రతిపత్తి కలిగిన వాహనాలు వాటి 'స్వార్మ్' టెక్నాలజీని కమిటీ నిశితంగా పరిశీలించింది.

తరువాత ఎన్ఎస్‌టీఎల్ లోని ప్రసిద్ధ 'సీ-కీపింగ్ అండ్ మెనూవరింగ్ బేసిన్' పరీక్షా కేంద్రంలో యుద్ధనౌకల నమూనాలపై నిర్వహించే 'హైడ్రోడైనమిక్ టెస్టింగ్'ను కమిటీ ప్రత్యక్షంగా వీక్షించింది. సముద్రపు అలల మధ్య యుద్ధనౌకలు ఎలా స్థిరంగా ఉంటాయో, వాటి వేగం కదలికలను ఈ బేసిన్ ద్వారా ల్యాబ్‌లోనే పరీక్షించవచ్చు.

నిపుణుల భేటీ - భవిష్యత్తు ప్రణాళిక

డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్, ఎన్ఎస్‌టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ ఈ సందర్భంగా కమిటీకి బ్రీఫింగ్ ఇచ్చారు. పరిశ్రమలు, విద్యా సంస్థలతో కలిసి ఎన్ఎస్‌టీఎల్ చేస్తున్న పరిశోధనలను వారు వివరించారు. ముఖ్యంగా మెరైన్ డొమైన్ అవేర్‌నెస్ అండర్ వాటర్ డొమైన్ అవేర్‌నెస్ విభాగాల్లో భారత్ సాధిస్తున్న ప్రగతిని కమిటీ కొనియాడింది.

కొచ్చిలో ఐఎన్ఎస్ సాగర్‌ధ్వని ప్రారంభం

విశాఖ పర్యటనకు ముందు, ఇదే కమిటీ కొచ్చిలోని నేవల్ ఫిజికల్ అండ్ ఓషియానోగ్రాఫిక్ లాబొరేటరీని సందర్శించింది. అక్కడ సోనార్ వ్యవస్థలను పరిశీలించడమే కాకుండా, సముద్ర పరిశోధనల కోసం ఐఎన్ఎస్ సాగర్‌ధ్వని నౌకను 'సాగర్ మైత్రి-5' మిషన్ కోసం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ పర్యటనల ద్వారా భారత నౌకాదళం అండర్ వాటర్ పోరాట సామర్థ్యంలో స్వయం సమృద్ధిని సాధిస్తోందని పార్లమెంటరీ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది.