
వివాహానికి ముందు ఎవరినీ నమ్మకండి: సుప్రీంకోర్టు
వివాహానికి ముందు యువకుడు–యువతి పూర్తిగా పరాయివాళ్లుగా భావించాల్సిందేనని, ముందుగా పెట్టుకునే శారీరక సంబంధాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. వివాహ వాగ్దానంతో మోసం చేసి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది పరస్పర సమ్మతితో జరిగిన సంబంధంలా కనిపిస్తోంది. మేము పాత తరానికి చెందినవాళ్లమేమో కానీ, వివాహానికి ముందు అబ్బాయి–అమ్మాయి పూర్తిగా పరాయివాళ్లే. శారీరక సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. వారి మధ్య ఎలాంటి అనుబంధం ఉన్నా, వివాహానికి ముందు ఇలాంటి సంబంధాలు ఎందుకు ఏర్పడ్డాయో అర్థం కావడం లేదు. మేం పాత ఆలోచనల వారమేమో కానీ, వివాహానికి ముందు ఎవరినీ నమ్మకండి. చాలా జాగ్రత్తగా ఉండాలని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు.
సమ్మతితోనే జరిగినట్లు అనిపిస్తోంది
ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వాదన ప్రకారం, ఇద్దరూ 2022లో ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పరిచయం అయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఢిల్లీలో పలుమార్లు, అనంతరం దుబాయ్‌లో కూడా శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. దీనిపై జస్టిస్ నాగరత్నపెళ్లి ముందు అంత కట్టుబాటుగా ఉంటే దుబాయ్‌కు ఎందుకు వెళ్లింది? అని ప్రశ్నించారు. ఇది పరస్పర సమ్మతితో జరిగిన సంబంధంలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసులు విచారణ చేసి శిక్షించే విధంగా ఉండవు. వారిని మధ్యవర్తిత్వానికి (మేడియేషన్) పంపుదామని తెలిపారు.
ఆరోపణల ప్రకారం, దుబాయ్‌లో ఆమె అనుమతి లేకుండా అతడు ఏకాంతంగా ఉన్న వీడియోలు రికార్డు చేసి, వాటిని విడుదల చేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం 2024 జనవరిలో పంజాబ్‌లో మరో మహిళను వివాహం చేసుకున్నాడని తెలిసిందని ఆమె తెలిపారు. ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు, ట్రయల్ కోర్టు తిరస్కరించాయి. ప్రారంభం నుంచే వివాహం చేసుకుంటానని మాట ఇవ్వడం తప్పుడు ఉద్దేశంతో ఇచ్చాడనే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. ముఖ్యంగా అతడు ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉండి, 2024 జనవరి 19న మళ్లీ పెళ్లి చేసుకున్న విషయం కోర్టు గమనించిందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇరుపక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కేసును బుధవారం విచారణకు మళ్లీ జాబితాలో చేర్చింది.
