
వియత్నాంలో తుఫాన్ బీభత్సం!
వియత్నాంలో ఆదివారం బువాలోయ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కేంద్ర, ఉత్తర ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ తుఫాన్ రాత్రి 6 గంటల వరకు క్వాంగ్ ట్రీ, గ్హే అన్ ప్రాంతాల మధ్య తీరం తాకనుంది. తుఫాన్ ప్రభావంతో గంటకు 133 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తు సముద్ర అలలు, భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇవి ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ఘటనలకు దారితీయవచ్చు. ఆదివారం ఉదయం 4 గంటలకు తుఫాన్ వియత్నాం మధ్య ప్రాంతానికి 200 కిలోమీటర్ల తూర్పున ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రభుత్వం ఉత్తర, మధ్య ప్రాంతాల్లో చేపల వేట పడవలను సముద్రానికి వెళ్లకుండా నిషేధించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల లోపు ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని ఆదేశించింది. డా నాంగ్‌లో 2,10,000 మందిని, హ్యూ ప్రాంతంలో 32,000 మంది తీరవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని రాష్ట్ర మీడియావర్గాలు తెలిపాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ నాలుగు తీర విమానాశ్రయాల్లో కార్యకలాపాలను నిలిపివేసింది, డానాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా అనేక విమానాలను రీషెడ్యూల్ చేసింది. శనివారం రాత్రి నుంచి కేంద్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హ్యూలో తక్కువ ప్రాంతాల్లో వరదలు వచ్చాయి, మూడు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, ఒక వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. క్వాంగ్ ట్రీలో ఒక చేపల పడవ మునిగిపోయింది, మరొకటి ఆశ్రయం కోసం వెళ్తూ చిక్కుకుంది. రక్షణ బృందాలు ఎనిమిది మందిని రక్షించాయి. ముగ్గురిని సముద్రంలో రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 1 వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఉత్తర, మధ్య ప్రాంతాల్లో వరదలు, కొండచరియల ఘటనలను పెంచవచ్చు. బువాలోయ్ ఈ వారంలో ఆసియాలో వచ్చిన రెండో పెద్ద తుఫాన్‌గా నిలిచింది. ఇటీవల వచ్చిన రగాసా తుఫాన్ ఫిలిప్పీన్స్, తైవాన్‌లో 28 మంది మరణాలకు కారణమైంది. ఇది చైనాలో కూడా తీవ్ర విధ్వంసం సృష్టించింది.
వియత్నాం తరచూ తుఫానులు, వరదలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ మధ్య ఇది తీవ్రంగా ఉంటోంది. 2024లో తుఫాన్ యాగి 300 మంది మరణాలకు కారణమై, 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని మిగిల్చింది.రగాసా తుఫాన్ ఈ వారంలో 28 మందిని బలితీసుకుంది. ఈ అనుభవాలతో వియత్నాం యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. 2020లో ఒకే సీజన్‌లో 9 తుఫాన్‌లు వచ్చాయి, వీటిలో మోలవే తుఫాన్ తీవ్ర నష్టం కలిగించింది. గత అనుభవాల నేపథ్యంలో వ్యవస్థలను అప్రమత్తం చేసుకుంటూ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
