Let's talk: editor@tmv.in
వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మృతి
వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మృతి

వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మృతి

Gaddamidi Naveen
12 జులై, 2026

వియత్నాంలోని పూ క్వోక్ ద్వీపం సమీపంలో పర్యాటక బోటు బోల్తా పడిన ఉదంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు శనివారం ధృవీకరించాయి.

భారత పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక టూరిస్ట్ స్పీడ్‌బోట్ అన్ తోయ్ రేవుకు తిరిగి వస్తుండగా పూ క్వోక్ ద్వీపం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బోటులో 32 మంది భారతీయ పర్యాటకులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 15 మంది భారతీయ పర్యాటకులు మరణించగా, 21 మందిని రక్షక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 17 మంది పర్యాటకులు, నలుగురు బోటు సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బోటులో ఉన్న మొత్తం 36 మంది వివరాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.

ప్రమాదంపై ఏపీ ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ.. ప్రాథమిక సమాచారం ప్రకారం మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ విషయమై మేము వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. పూర్తి వివరాలు అధికారికంగా ఖరారైన తర్వాత వెల్లడిస్తామని తెలిపాయి.

మచిలీపట్నానికి చెందిన ఇద్దరు మహిళల మృతి

మృతులను మచిలీపట్నానికి చెందిన జయలక్ష్మి, జయశ్రీలుగా ప్రాథమిక నివేదికల ఆధారంగా గుర్తించారు. ప్రమాదానికి గురైన మిగిలిన భారతీయ పౌరుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. గాయపడిన ఏపీకి చెందిన మరో ముగ్గురిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అన్ తోయ్ బోర్డర్ గార్డ్ స్టేషన్, వియత్నాం నావికాదళం, కోస్ట్ గార్డ్ రీజియన్-4 సిబ్బంది స్థానిక పడవలతో కలిసి పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను రక్షించడానికి లైఫ్ రాఫ్ట్‌లు, జెట్ స్కీలను రంగంలోకి దించారు.

బిజినెస్ ట్రిప్‌లో విషాదం

వియత్నాంకు చెందిన 'త్రీలాండ్ ట్రావెల్' సంస్థ స్థానిక వెండర్ 'సాయి వియత్నాం' సహకారంతో ఈ టూర్‌ను ఏర్పాటు చేసింది. ఈ పర్యాటకుల బృందం అంతా ఒక ప్రముఖ మొబైల్ కంపెనీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లుగా సమాచారం.

ఈ పర్యాటక బృందంలో సభ్యుడైన హరిహర్ శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశానికి చెందిన 105 మంది మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు బిజినెస్ ఇన్సెంటివ్ (సేల్స్ టార్గెట్లు పూర్తి చేసినందుకు కంపెనీ ఇచ్చిన బహుమతి) ట్రిప్‌లో భాగంగా వియత్నాం వచ్చారని తెలిపారు. ఈ మొత్తం పర్యటనలో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది కూడా ఉన్నారని, అయితే ప్రమాదానికి గురైన బోటులో వారు లేరని స్పష్టం చేశారు.

శనివారమే ఈ బృందం ద్వీపానికి చేరుకుందని శ్రీనివాస్ చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందనేది వివరిస్తూ.. ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురు గాలుల వల్లే పడవ బోల్తా పడిందని పేర్కొన్నారు. అది పూర్తిగా మూసి ఉన్న పడవ. అదే పెద్ద సమస్య అయిందన్నారు. ఒకవేళ అది తెరిచి ఉన్న పడవ అయి ఉంటే, ప్రాణనష్టం ఇంతలా ఉండేది కాదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 70 మంది వరకు ఆసుపత్రిలో చేరారని, తాము ఇంకా ద్వీపంలోనే ఉన్నామని ఆయన తెలిపారు. సముద్రం ఉధృతంగా ఉండటం లేదా పడవలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై వియత్నాం అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

తెలుగు రాష్ట్రాల నేతల తీవ్ర దిగ్భ్రాంతి, సహాయక చర్యలపై సీఎంల ఆదేశాలు

వియత్నాంలోని పర్యాటక బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మరణించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, వియత్నాంలోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రమాద వార్తపై వెంటనే స్పందించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అప్రమత్తం చేశారు. కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏపీ నుంచి మొత్తం 33 మంది వియత్నాం వెళ్లగా, ప్రమాదం జరిగిన బోటులో 19 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. సురక్షితంగా బయటపడిన వారిని వెంటనే స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కడప, బందరు (మచిలీపట్నం) ప్రాంతాలకు చెందిన పలువురు మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రమాదంలో మృతి చెందడం తనను ఎంతో కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వియత్నాంలో చిక్కుకుపోయిన తెలుగు పర్యాటకులను సురక్షితంగా తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు
VietnamBoatAccidentVietnamTragedyTeluguTouristsAndhraPradeshTelanganaPhuQuocBoatCapsizeIndianTouristsBreakingNewsTeluguNewsAPNews
వియత్నాంలో ఘోర పడవ ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మృతి - Tholi Paluku