Let's talk: editor@tmv.in
విమాన సంక్షోభానికి రామ్‌మోహన్ నాయుడి వైఫల్యమే కారణం: వైసీపీ నేత భరత్

విమాన సంక్షోభానికి రామ్‌మోహన్ నాయుడి వైఫల్యమే కారణం: వైసీపీ నేత భరత్

Panthagani Anusha
9 డిసెంబర్, 2025

దేశంలో ప్రస్తుతం నెలకొన్న విమానయాన సంక్షోభంపై వైఎస్సార్సీపీ నాయకుడు మార్గాని భారత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సివిల్ ఏవియేషన్‌ మంత్రి కింజరపు రామ్‌ మోహన్‌ నాయుడు అనుభవ రాహిత్యంతో తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలే ప్రస్తుత పరిస్థితులకు కారణమని ఆయన ఆరోపించారు.

ఎఫ్‌డిటిఎల్* *కొత్త నియమాలే సంక్షోభ మూలం

భారత్ మాట్లాడుతూ పైలట్లకు సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ ( ఎఫ్‌డిటిఎల్ ) నిబంధనలను ఎలాంటి శాఖా స్థాయి సమీక్ష లేకుండానే కేంద్రం అకస్మాత్తుగా అమలు చేసిందని దాంతో పైలట్ల తప్పనిసరి విశ్రాంతి సమయం 36 గంటల నుంచి 48 గంటలకు పెరగడంతో దేశవ్యాప్తంగా పైలట్ల కొరత తలెత్తిందన్నారు. ఈ ఒక్క నిర్ణయం వల్లే షెడ్యూల్‌లు దెబ్బతిని, ప్రధాన ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు గందరగోళానికి గురయ్యాయని ఆయన తెలిపారు.

ఇండిగోకు భారీ దెబ్బ

భారత్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ఇప్పటికే తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. 434 విమానాలతో రోజూ 2,300 ఫ్లైట్లు నడిపే ఈ సంస్థకు కొత్త నిబంధనల కారణంగా అదనంగా 900 పైలట్లు అవసరమవుతున్నాయని ఆయన వివరించారు. ఫ్లైట్ రద్దు, ఆలస్యాలు పెరగడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను భారత్ ప్రస్తావించారు.

ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు – టికెట్ ధరల పెరుగుదల

విమానల రద్దు కారణంగా రోగులు, వృద్ధులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారు, మరణించిన వారి మృతదేహాలు తరలించే కుటుంబాలు భారీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొంతమంది ఎయిర్‌లైన్స్ టికెట్ ధరలను గణనీయంగా పెంచేశాయని విమర్శించారు.

లోకేష్‌పై టిడిపిపై విమర్శలు

సంక్షోభ సమయంలో ఐటీ మంత్రి నారా లోకేష్‌ “వార్ రూమ్‌ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారనే” ప్రచారాన్ని టిడిపి ప్రతినిధులు వార్తా చానెళ్లలో విస్తృతంగా ప్రచారం చేస్తుండటం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని భారత్ అన్నారు. సివిల్ ఏవియేషన్ శాఖతో లోకేష్‌కు సంబంధం లేనప్పటికీ ఇలాంటి ప్రచారం చేయడం పార్టీకి అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

అహ్మదాబాద్ ఘటనపై ఆరోపణలు

ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించకుండా, ప్రమాద స్థలంలో సోషల్ మీడియా టీంతో కలిసి రీల్స్ షూటింగ్ చేయడంలో ఆసక్తి కనబరుస్తున్నారని కేంద్ర మంత్రిని భారత్ తీవ్రంగా విమర్శించారు. అయితే మార్గాని భారత్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ పార్టీ టిడిపి నుంచి ఇంకా ఎటువంటి ప్రతిస్పందన రాలేదు.

విమాన సంక్షోభానికి రామ్‌మోహన్ నాయుడి వైఫల్యమే కారణం: వైసీపీ నేత భరత్ - Tholi Paluku