Let's talk: editor@tmv.in
విమాన ప్రయాణికులకు శుభవార్త… ఇండిగో సంక్షోభం మధ్య ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

విమాన ప్రయాణికులకు శుభవార్త… ఇండిగో సంక్షోభం మధ్య ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

Gaddamidi Naveen
9 డిసెంబర్, 2025

దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆపరేషనల్ సంక్షోభం నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర టికెట్ ధరల పరిమితి నిబంధనలు నిన్నటి నుంచి (డిసెంబర్ 8, 2025) అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ముందుగానే స్వీకరించిన ఎయిర్ ఇండియా, అన్ని ప్రధాన దేశీయ రూట్లపై కొత్త రేట్లను అమలు చేస్తూ ప్రయాణికులకు పెద్ద ఊరటను అందించింది.

ఇటీవల ఇండిగోకు సంబంధించిన భారీ సంఖ్యలో విమానాల రద్దులు, ఆలస్యాలు, సిబ్బంది సమస్యలు కారణంగా దేశీయ విమాన రవాణా విభాగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ, ప్రయాణికులపై అధిక ఛార్జీలు విధించకుండా టికెట్ ధరలకు గరిష్ట పరిమితులు నిర్ణయిస్తూ ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది.దానికి స్పందించిన తొలి ప్రధాన ఎయిర్‌లైన్‌గా ఎయిర్ ఇండియా ముందుకొచ్చింది.

కొత్త రేట్ల ప్రకారం, ఈ పరిమితి ద్వారా ముఖ్యంగా ప్రధాన నగరాల మధ్య రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో టికెట్ ధరలు నియంత్రణలో ఉండనున్నాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు విమానాలు అదనపు సీట్లను కూడా అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.

విమాన రంగంలో ఏర్పడ్డ ఈ అకస్మాత్తు సంక్షోభ సమయంలో ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు భారీగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా టికెట్ రేట్లు స్థిరంగా ఉండటం ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కానుంది. విమానాల రద్దు నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ఇప్పటికే 89 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విమాన ఛార్జీలను నియంత్రించడంతో ప్రయాణికులకు రెండు విధాలుగా ఉపశమనం లభించినట్లయింది.

విమాన ప్రయాణికులకు శుభవార్త… ఇండిగో సంక్షోభం మధ్య ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం - Tholi Paluku