
విమానాశ్రయాల్లో ‘డిజీ యాత్ర’ ప్రారంభం
ప్రయాణికుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ సేవలలో భాగంగా ‘డిజీ యాత్ర’ సదుపాయాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆదివారం ప్రారంభించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా ఈ సేవను జాలీ గ్రాంట్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా ఎలాంటి మాన్యువల్ చెకింగ్ అవసరం లేకుండా విమానాశ్రయంలోకి సులభంగా ప్రవేశించవచ్చు. చెక్-ఇన్, బోర్డింగ్ పాస్, భద్రతా తనిఖీలు వంటి ప్రక్రియల్లో సమయం గణనీయంగా తగ్గనుంది. ఇప్పటివరకు ఈ సదుపాయం ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నారు.
ప్రయాణికురాలు దివ్యా సింగ్‌నియా మాట్లాడుతూ డిజీ యాత్ర వల్ల చెక్-ఇన్ నుంచి సెక్యూరిటీ వరకు ఎక్కడా లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా సౌకర్యంగా ప్రయాణించవచ్చు. ఇది చాలా మంచి చర్య అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
డిజి యాత్ర ఒక సెల్ఫ్-సావరిన్ ఐడెంటిటీ (ఎస్‌ఎస్‌ఐ) ఆధారిత డిజిటల్ వ్యవస్థ. ఇది ఫేషియల్ బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా కాంటాక్ట్‌లెస్, పేపర్‌లెస్ ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు ఎలాంటి కేంద్ర సర్వర్‌లో నిల్వ చేయకుండా, వారి మొబైల్ ఫోన్‌లో సురక్షితంగా స్టోర్ అవుతాయి. డేటా భద్రత కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగిస్తుండగా , ఉపయోగించిన 24 గంటల్లో ఆ డేటా సర్వర్‌ల నుంచి తొలగించబడుతుంది. దీంతో ప్రయాణికుల గోప్యతకు పూర్తి రక్షణ కల్పిస్తామని అధికారులు తెలిపారు.
