
విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు జరిగాయి: కేంద్రమంత్రి
ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో ఇటీవల నమోదైన తప్పుడు సంకేతాలు అందిన (జీపీఎస్ స్పూఫింగ్) ఘటనలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. పలు విమానాలు ల్యాండింగ్ సమయంలో తప్పుడు నావిగేషన్ సంకేతాలను స్వీకరించినట్లు తెలిపారు.
శీతాకాల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఎస్. నిరంజన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రన్‌వే 10పై జీపీఎస్ ఆధారిత ల్యాండింగ్ విధానాన్ని అనుసరిస్తున్న విమానాలకు స్పూఫ్డ్ సిగ్నల్స్ అందాయని, వెంటనే విమానాలు ప్రత్యామ్నాయ అత్యవసర విధానాలకు మార్చుకున్నాయని తెలిపారు. మిగతా రన్‌వేల్లో భూ ఆధారిత నావిగేషన్ పరికరాలు అందుబాటులో ఉండడంతో వాటి కార్యకలాపాలు ప్రభావితం కాలేదని చెప్పారు.
డీజీసీఏ–ఏఏఐ చర్యలు
జీపీఎస్ స్పూఫింగ్ ప్రమాదాలపై సమగ్ర విచారణకు, నివారణకు పలు చర్యలు చేపట్టినట్లు నాయుడు వివరించారు.
• జీఎన్ఎస్ఎస్ అంతరాయం పై 2023లో జారీ చేసిన సలహా సర్క్యులర్ జారీ
• 2025 నవంబర్ 10న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో జీపీఎస్ స్పూఫింగ్ ఘటనల తక్షణ నివేదికల కోసం కొత్త ఎస్ఓపీ
• అంతరాయం మూలాన్ని గుర్తించేందుకు వైర్లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ సహకారం
డీజీసీఏ–ఏఏఐ అందించిన ప్రాథమిక డేటా ఆధారంగా మానిటరింగ్ ఆర్గనైజేషన్ అదనపు వనరులు వినియోగిస్తూ స్పూఫింగ్ మూలాన్ని గుర్తించేందుకు కృషి చేస్తుందని తెలిపారు.
ఇతర ఎయిర్‌పోర్ట్‌లలోనూ ఘటనలు
2023 నవంబర్ నుంచి డీజీసీఏ జీపీఎస్ జ్యామింగ్/స్పూఫింగ్ ఘటనలను తప్పనిసరిగా నివేదించేలా చేసిన తర్వాత, దేశవ్యాప్తంగా ఘటనలు నమోదవుతున్నాయని మంత్రి తెలిపారు. కోల్ కతా, అమృతసర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల్లో జీఎన్ఎస్ఎస్ అంతరాయాలు రికార్డ్ అయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కనీస ఆపరేటింగ్ నెట్‌వర్క్ కింద భూ ఆధారిత నావిగేషన్ పరికరాల నిర్వహణ కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్త ర్యాన్స్‌వేర్, మాల్వేర్ ముప్పుల నేపథ్యంలో విమానయాన సైబర్–భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రొటెక్షన్ సెంటర్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇన్ మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయ ఐటీ నెట్‌వర్కులు, కీలక మౌలిక వసతుల రక్షణకు అడ్వాన్స్‌డ్ సొల్యూషన్లు అమలు చేయాలి. సైబర్ ముప్పులు నిరంతరం మారుతున్నందున భద్రతా వ్యవస్థలు కూడా నిరంతరం అప్‌డేట్ కావాలని నాయుడు స్పష్టం చేశారు.
