
విమానంలో ప్రయాణికురాలి ప్రాణాన్ని కాపాడిన కర్ణాటక మాజీ ఎమ్మెల్యే
కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, వృత్తిరీత్యా వైద్యురాలైన అంజలి నింబాల్కర్, గోవా-న్యూఢిల్లీ ఫ్లైట్‌లో మిడ్ ఎయిర్‌లో వైద్య అత్యవసర పరిస్థితికి గురైన అమెరికన్ మహిళా ప్రయాణికురాలి ప్రాణాన్ని కాపాడినట్టు ఆదివారం అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటన గోవా, డయ్యూ,డామన్, దాద్రా నగర్ హవేలీలో ఏఐసిసి సెక్రటరీ బాధ్యతలు నిర్వహిస్తున్న నింబాల్కర్, ఆదివారం రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ చోరీ’ ర్యాలీకి హాజరు కావడానికి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
అభినందించిన ప్రయాణికులు, సిబ్బంది
తీవ్రమైన అస్వస్థతకు, వణుకు వస్తోందని చెప్పిన సహ ప్రయాణికురాలు మూర్ఛపోయి పల్స్ కోల్పోయినప్పుడు నింబాల్కర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్) చేసి ఆమెను కాపాడారు.
ప్రయాణం మొత్తం సమయంలో నింబాల్కర్ రోగి పక్కనే ఉండి, ఆమె వైద్య అవసరాలపై శ్రద్ధ పెట్టి ఓదార్చారు. ఢిల్లీలో ల్యాండింగ్ అయిన వెంటనే అస్వస్థతకు గురైన ఆ విదేశీ ప్రయాణికురాలిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నింబాల్కర్ సకాలంలో చేసిన పనికి ప్రయాణికులు, క్రూ సిబ్బంది ప్రశంసలు అందించారు.
సీఎం ప్రశంసం
నింబాల్కర్ ను కొనియాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 'ఎక్స్'లో పోస్ట్ చేశారు
గోవా-న్యూఢిల్లీ విమానంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ చూపిన అద్భుతమైన ధైర్యానికి అత్యంత గర్వపడుతున్నాను. అమెరికన్ మహిళకు మిడ్ ఎయిర్‌లో వైద్య అత్యవసరం ఏర్పడినప్పుడు డాక్టర్ అంజలి తక్షణమే స్పందించి సకాలంలో సిపిఆర్ చేసి ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడారు.
వైద్య వృత్తి నుంచి దూరమై రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ, ఆమెలోని డాక్టర్ స్పందించారని, ఇది ప్రొఫెషనల్ నైపుణ్యం మాత్రమే కాకుండా మానవత్వం, సేవ, సహప్రయాణికుల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా డాక్టర్ అంజలి నింబాల్కర్ వంటి నాయకులు నిజమైన ప్రజాసేవకు మెరుగైన ఉదాహరణలు. ఏమీ ఆశించకుండా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు సమాజానికి శక్తివంతమైన ప్రమాణాన్ని నిర్దేశిస్తారు. నాయకత్వం నిజమైన అర్థాన్ని గుర్తు చేస్తారు అని ఆయన ప్రశంసించారు.
మీ నుంచే నేర్చుకున్నా
సిఎంకు కృతజ్ఞతలు తెలిపిన నింబాల్కర్ తాను డాక్టర్‌గా తన విధిని నిర్వర్తించానని చెప్పారు. ఇది కూడా డాక్టర్‌గా నా ఉద్యోగ బాధ్యత, అవసరమైనప్పుడల్లా ఈ సామర్థ్యంలో సేవ చేయడం. సామాజిక నిబద్ధతకు ఉదాహరణ అయిన మీ నుంచే నేను నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె సీఎం పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు.
