Let's talk: editor@tmv.in
వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో తొక్కిసలాట

వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో తొక్కిసలాట

Panthagani Anusha
21 జనవరి, 2026

పండగ సెలవులు ముగియడంతో స్వస్థలాలకు ఉద్యోగ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం చేపట్టిన ప్రయాణికులతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌ సోమవారం కిక్కిరిసిపోయింది. రద్దీకి తగినన్ని బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూస్తూ ఒక్కసారిగా ఎగబడటంతో బస్టాండ్‌లో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు.

బస్సు డిపో నుంచి ఓ బస్సు గేటు దాటి బయటకు వస్తున్న సమయంలో దానిని చూసిన ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు పరుగులు తీశారు అయితే డ్రైవర్ బస్సును ఆపకుండా ముందుకు తీసుకెళ్లడంతో కొందరు జారి పడిపోయారు. ఈ క్రమంలో కొందరు బస్సు కింద పడటంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

ఈ ప్రమాదంలో బొల్లాపల్లి మండలం కండ్రికకు చెందిన మెగా వత్తు మంత్రి భాయ్‌, వెల్లటూరుకు చెందిన బెల్లంకొండ చిన్న వెంకటేశ్వర్లు, పుల్లలచెరువుకు చెందిన ఎస్తేరమ్మ, నూజీల మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన కోటేశ్వరమ్మతో పాటు మరో ప్రయాణికికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బస్టాండ్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించి, బస్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

వేల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నప్పటికీ అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయకపోవడంపై ఆర్టీసీపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ రద్దీని ముందుగానే అంచనా వేసి ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. ఈ ఘటనకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

వినుకొండ ఆర్టీసీ బస్టాండ్‌లో తొక్కిసలాట - Tholi Paluku