Let's talk: editor@tmv.in
విధుల్లో చేరుతున్న ఎక్సైజ్ ఎస్‌ఐలు అంకితభావంతో పని చేయాలి: కొల్లు రవీంద్ర

విధుల్లో చేరుతున్న ఎక్సైజ్ ఎస్‌ఐలు అంకితభావంతో పని చేయాలి: కొల్లు రవీంద్ర

Panthagani Anusha
15 మార్చి, 2026

రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో నూతనంగా విధుల్లో చేరుతున్న అధికారులు అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తించి ప్రభుత్వానికి,శాఖకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు నియామక పత్రాలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగిత నిర్మూలనపై దృష్టి సారించిందని గుర్తుచేశారు. "ఎక్సైజ్ శాఖలో మొత్తం 550 మంది ఎస్‌ఐల కేడర్ ఉండగా ఒకేసారి 150 మంది యువ అధికారులు (వీరిలో 38 మంది మహిళలు) చేరడం శుభపరిణామం. ఇది శాఖకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది అని ఆయన పేర్కొన్నారు. కేవలం ఎక్సైజ్ శాఖలోనే కాకుండా మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టామని రాబోయే కాలంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా అక్రమ మద్యం నిర్మూలన కోసం 'నవోదయం' కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. "ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ మద్యం పై ఉక్కుపాదం మోపాలి. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి అని అధికారులను ఆదేశించారు. సురక్షితమైన మద్యం సరఫరా చేస్తూనే, అక్రమ విక్రయాలను నూరు శాతం అరికట్టాలని స్పష్టం చేశారు.

సాంకేతికతతో పారదర్శకత

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ శిక్షణ కాలంలో చట్టాల పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలని విధుల్లో సాంకేతికతను జోడించి పారదర్శకంగా పనిచేయాలని కోరారు. ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ అనసూయా దేవి, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విధుల్లో చేరుతున్న ఎక్సైజ్ ఎస్‌ఐలు అంకితభావంతో పని చేయాలి: కొల్లు రవీంద్ర - Tholi Paluku