Let's talk: editor@tmv.in
విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్ రెడ్డి

విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
24 మార్చి, 2026

విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల సమక్షంలో తలా రూ. 1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.

అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో, విధి నిర్వహణలో మృతి చెందిన ఓర్సు సురేష్, ముఖ్తార్ బేగ్ కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయిన తరుణంలో ఆ కుటుంబం వీధిన పడకూడదనే ఉద్దేశంతో ఈ భారీ బీమా మొత్తాన్ని అందిస్తున్నామని తెలిపారు.

విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్ర‌భుత్వం అండగా ఉంటుంద‌ని సీఎం వ్యాఖ్యానించారు.ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

అదేవిధంగా, ప్రజల ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. సీపెక్ సర్వేలో గుర్తించిన కుటుంబాలకు రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తామని చెప్పారు. బాధితులను ఆదుకోవడంలో చొరవ చూపిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను సీఎం అభినందించారు.ఈ కార్యక్రమం అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించగా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.