
విద్య, వైద్యానికి పెద్దపీట: డిప్యూటీ సీఎం భట్టి ప్రీ బడ్జెట్ సమావేశం
రాష్ట్రంలో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైనంత నిధులు ఖర్చు చేయడానికి ప్రభుత్వం వెనుకాడబోదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మైనారిటీ సంక్షేమం, బీసీ సంక్షేమం, రోడ్డు రవాణా, నీటిపారుదల, సివిల్ సప్లయిస్, రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ హాజరయ్యారు.
మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్షలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆదాయం, వ్యయం సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతల ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల బిల్లులను వేగంగా పంపిస్తే వెంటనే క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే హాస్టల్ భవనాల మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశించారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, అన్ని వర్గాల విద్యార్థులు ఉమ్మడి వాతావరణంలో కలిసి చదవడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, బోధన సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు వ్యవస్థ లేకపోతే తక్షణమే అమలు చేయాలని, దానిని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ భవనాలపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు అదనపు ఆదాయం కూడా పొందవచ్చని ఆయన తెలిపారు.
హాస్టళ్లు, రెసిడెన్షియల్ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా, అదనపు విద్యుత్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు సవ్యసాచి ఘోష్, వికాస్ రాజ్, రాహుల్ బొజ్జా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
