
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదు: ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో వేసవి కాలం దృష్ట్యా విద్యుత్ వినియోగం భారీగా పెరగనున్న నేపథ్యంలో, వినియోగదారులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు అన్ని విద్యుత్ సంస్థలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల మధ్య సమన్వయం అత్యవసరమని స్పష్టం చేశారు.
రాబోయే మే నెల నాటికి రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ సుమారు 280 మిలియన్ యూనిట్లకు (ఎంయూ) చేరవచ్చని అంచనాలు ఉన్నాయని విజయానంద్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సగటున 264 మిలియన్ యూనిట్లకు పైగా వినియోగం నమోదవుతోందని ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 9.1 శాతం వృద్ధిని సూచిస్తోందని వివరించారు. ముఖ్యంగా మార్చి 7న రాష్ట్ర గ్రిడ్‌లో రికార్డు స్థాయిలో 274.6 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైందని, గరిష్ఠ లోడ్ 14,000 మెగావాట్లు దాటడం రానున్న వేసవి తీవ్రతకు సంకేతమని ఆయన అధికారులను అప్రమత్తం చేశారు.
రాబోయే ఏప్రిల్ నెలలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 14,500 మెగావాట్లకు చేరే అవకాశం ఉందని ముఖ్యంగా తెల్లవారుజామున సుమారు 400 మెగావాట్ల వరకు తాత్కాలిక లోటు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన గుర్తించారు. ఈ లోటును భర్తీ చేసేందుకు వీలుగా ముందస్తుగా విద్యుత్ కొనుగోలు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరానికి అనుగుణంగా విద్యుత్ ఎక్స్ఛేంజ్‌లలోని డే-అహెడ్ మార్కెట్ (DAM), రియల్ టైమ్ మార్కెట్ ద్వారా సమర్థవంతంగా విద్యుత్ కొనుగోలు చేసి, సరఫరాలో ఎక్కడా కోతలు లేకుండా చూడాలని ఆదేశించారు.
తాప విద్యుత్ కేంద్రాలు (థర్మల్ ప్లాంట్స్) పునరుత్పాదక ఇంధన వనరుల నుండి విద్యుత్ ఉత్పత్తి లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని విజయానంద్ అధికారులకు సూచించారు. గత పది రోజులుగా వినియోగం ఒక్కసారిగా పెరిగిన దృష్ట్యా, విద్యుత్ ఎక్స్ఛేంజ్‌ల నుండి అదనపు విద్యుత్ కొనుగోలుకు వెనుకాడొద్దని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సామాన్య వినియోగదారుల నుంచి పరిశ్రమల వరకు ఎవరికీ విద్యుత్ అంతరాయం కలగకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
