Let's talk: editor@tmv.in
విద్యుత్ శాఖలో త్వరలో కొత్త నియామకాలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

విద్యుత్ శాఖలో త్వరలో కొత్త నియామకాలు: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Panthagani Anusha
13 ఫిబ్రవరి, 2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ కూన రవికుమార్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పెరిగిన పని ఒత్తిడిని తగ్గించేందుకు సీఎం అనుమతితో త్వరలోనే కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు కీలక ప్రకటన చేశారు.

ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లలో ఇప్పటికే 90 శాతం సమస్యలను పరిష్కరించామని మంత్రి వెల్లడించారు. మెడికల్ ఇన్సూరెన్స్ పరిమితికి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను కూడా త్వరలోనే చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని దేశంలోనే ట్రూ అప్ ఛార్జీలను 'ట్రూ డౌన్' చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లను తగ్గించి సొంత వనరులతో రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధిస్తున్నట్లు వివరించారు.

పీఏసీ ఛైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ.. ఏపీ విద్యుత్ సంస్కరణలు దేశానికే ఆదర్శమని బీసీల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సంఘం అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ, ఇంక్రిమెంట్లు కారుణ్య నియామకాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కే.అప్పారావు, ఆర్థిక కార్యదర్శి ఎస్. వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా రాబోయే మహాశివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ డిస్కమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో డిస్కమ్ సీఎండీలు ఎల్.శివశంకర్, ఐ. పృధ్వీ తేజ్, పి. పుల్లారెడ్డి తదితరులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సన్నద్ధతపై సమీక్షించారు.

పండుగ సందర్భంగా ప్రధాన శివాలయాలు, ఇతర దేవాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని సూచించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయాలని, 24 గంటల మెయింటెనెన్స్ బృందాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, పంపిణీ లైన్లపై ముందస్తు తనిఖీలు చేపట్టి ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే పునరుద్ధరణ చర్యలు తీసుకునేలా ఫీల్డ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.