Let's talk: editor@tmv.in
విద్యుత్ వినియోగదారులకు ఊరట:రూ.4,500 కోట్ల 'ట్రూ-అప్' భారం సర్కారుపైనే

విద్యుత్ వినియోగదారులకు ఊరట:రూ.4,500 కోట్ల 'ట్రూ-అప్' భారం సర్కారుపైనే

Panthagani Anusha
3 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై పడాల్సిన భారీ ఆర్థిక భారాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో (2019 నుంచి 2024 మధ్య కాలంలో) విద్యుత్ పంపిణీ సంస్థల్లో (డిస్కమ్‌లు) పేరుకుపోయిన రూ. 4,500 కోట్ల ట్రూ-అప్ బకాయిలను ప్రజల నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వమే నేరుగా చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) కార్యదర్శి పి.కృష్ణ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఈ చర్య వల్ల రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ఒక్కసారిగా పెరిగే 'టారిఫ్ షాక్' ప్రమాదం నుంచి సామాన్యులకు విముక్తి లభించింది స్పష్టం చేశారు.

సాధారణంగా విద్యుత్ ఉత్పత్తికి అయ్యే అసలు వ్యయం (విద్యుత్ కొనుగోలు, ఇంధన వ్యయం) వినియోగదారుల నుంచి వసూలు చేసే టారిఫ్ మధ్య ఏర్పడే వ్యత్యాసాన్నే 'ట్రూ-అప్' చార్జీలుగా పరిగణిస్తారు. డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలు కోసం అదనంగా ఖర్చు చేసినప్పుడు, ఆ లోటును భవిష్యత్ బిల్లుల ద్వారా వినియోగదారుల నుంచే వసూలు చేయడం విద్యుత్ రంగంలో ఒక నిబంధన. అయితే గత ఐదేళ్ల కాలంలో ఈ బకాయిలను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయకుండా వాయిదా వేస్తూ రావడం వల్ల అవి కొండలా పేరుకుపోయి రూ. 4,500 కోట్లకు చేరాయి. ఇప్పుడు వీటిని వినియోగదారులపై మోపితే ప్రతి కుటుంబంపై వేల రూపాయల భారం పడుతుందని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ప్రజల క్షేమం దృష్ట్యా ఈ మొతాన్ని తామే భరిస్తామని ఏపీఈఆర్‌సీకి హామీ ఇచ్చింది.

ఇక డిస్కమ్‌ల వారీగా బకాయిల వివరాలను పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా మూడు సంస్థలకు భారీగా నిధులు రావాల్సి ఉంది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కి రూ. 1,783 కోట్లు, సదర్న్ పవర్ కు రూ. 1,552 కోట్లు అదేవిధంగా సెంట్రల్ పవర్ కు రూ. 1,163 కోట్లు బకాయిలుగా ఉన్నట్లు ఏపీఈఆర్‌సీ వెల్లడించింది.

టారిఫ్ షాక్ నుంచి విముక్తి

ఒకవేళ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకోకపోయి ఉంటే నిబంధనల ప్రకారం ఈ రూ. 4,500 కోట్లను ప్రస్తుత వినియోగదారుల విద్యుత్ బిల్లుల ద్వారా వసూలు చేయాల్సి ఉండేది. దీనివల్ల ప్రతి ఇంటిపై నెలవారీ బిల్లులో అదనపు భారం పడి, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ చార్జీలు ఒక్కసారిగా పెరిగేవి (టారిఫ్ షాక్). అయితే సామాన్యుడిపై ఈ భారం మోపడం భావ్యం కాదని భావించిన ప్రస్తుత ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన ఈ మొత్తాన్ని తన ఖజానా నుంచే చెల్లించేందుకు ముందుకొచ్చింది.

కాగా గత ప్రభుత్వ హయాంలో సరైన ఆర్థిక నిర్వహణ లేకపోవడం, కీలక నిర్ణయాల్లో జరిగిన జాప్యం,వాయిదా పద్ధతులు అనుసరించడం వల్లనే డిస్కమ్‌లు ఈ స్థాయిలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఏపీఈఆర్‌సీ తన ప్రకటనలో అభిప్రాయపడింది. ఇవన్నీ భవిష్యత్ క్లెయిమ్‌లుగా మారడం వల్ల విద్యుత్ రంగంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

ఈ బకాయిలను ప్రజల నుంచి వసూలు చేయకుండా, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే క్లెయిమ్ చేసుకోవాలని కమిషన్ ఇప్పటికే డిస్కమ్‌లను ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలకు తక్షణమే నిధులు అందుబాటులోకి వచ్చి వాటి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా, వినియోగదారులకు ఎటువంటి అదనపు భారం లేకుండానే నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఏర్పడింది. గడిచిన ఐదేళ్ల ఆర్థిక అస్తవ్యస్తతను సరిదిద్దుతూ సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.