
విద్యుత్ రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి గొట్టిపాటి రవి కుమార్
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, నెడ్‌క్యాప్ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రజలందరికీ నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. వినియోగదారుల సంతృప్తి స్థాయిని 90 శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
విద్యుత్ నష్టాలను తగ్గించుకోవడానికి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరగాలని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ‘మోడల్ సోలార్ విలేజ్ ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాలను విస్మరించి రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టింది. కానీ మా ప్రభుత్వం వచ్చే నాలుగు నెలల్లో 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది అని మంత్రి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ కనెక్షన్లు అందించడంతో పాటు మెటీరియల్ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను సాగు సీజన్ ప్రారంభం అయ్యేలోపు మంజూరు చేయాలని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సీపీడీసీఎల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 11 వేల కనెక్షన్లను తక్షణం మంజూరు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న లో-ఓల్టేజ్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే 980 ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు.అదేవిదంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, దొంగతనాలకు పాల్పడే వారితో పాటు వాటిని కొనుగోలు చేసే వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.
స్మార్ట్ మీటర్లపై స్పష్టత
వినియోగదారుల సమ్మతి ఉన్నచోట మాత్రమే స్మార్ట్ మీటర్లను బిగించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారులపై ఎలాంటి బలవంతం ఉండకూడదని వారి అనుమతితోనే పీఎం సూర్యఘర్ వంటి పథకాలను అమలు చేయాలన్నారు. ఆర్డీఎస్ఎస్ పనులను మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సమావేశంలో సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్, నెడ్‌క్యాప్ అధికారులు మరియు ఇంధన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
