Let's talk: editor@tmv.in
విద్యుత్ ఛార్జీల తగ్గింపుతో తాడేపల్లికి షాక్!

విద్యుత్ ఛార్జీల తగ్గింపుతో తాడేపల్లికి షాక్!

FL - SUNL
30 సెప్టెంబర్, 2025

విద్యుత్ ఛార్జీల తగ్గింపుతో తాడేపల్లి షాక్ గురైందని సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘గత పాలకులు విద్యుత్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పీపీఏలను రద్దు చేసి, తమ కమిషన్ల కోసం అనేక అక్రమాలు చేశారు’’ అని విమ‌ర్శించారు.

వైసీపీ పాల‌న‌లో హిందూజా వంటి సంస్థలకు ప్రయోజనం కలిగించేలా ఒప్పందాలు కుదిర్చార‌ని ఆరోపించారు. ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్లు, ఇతర పరికరాలపై అధిక ధరలు విధించడంతో విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంద‌న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ రంగాన్ని తిరిగి పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ ఛార్జీలను పెంచకుండా, వీలైనంతవరకు తగ్గిస్తామని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి యూనిట్‌కు 13 పైసల మేర విద్యుత్ చార్జీ తగ్గింపును నవంబర్ 1 నుండి అమలు చేస్తున్నామ‌న్నారు. ఇప్పటి వరకు ప్రజలు ట్రూ అప్ అనే పదం విన్నారు కానీ ఈ రోజు కొత్తగా ట్రూ డౌన్ అనే పదాన్ని పరిచయం చేస్తున్నామ‌న్నారు. ‘‘గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నాసిరకం బొగ్గు సరఫరా, అధిక రేట్లతో విద్యుత్ కొనుగోలు చేయడం వంటి చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ భారీ ఆర్థిక నష్టాలను చవిచూసింది. హిందూజాకు 1400 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చిన విషయం, అధిక వడ్డీ రేట్లతో విద్యుత్ కొనుగోలు చేసి రూ.10,892 కోట్ల నష్టం కలిగించడం ప్రజలు మరచిపోలేదు” అన్నారు.

“అమెరికా కోర్టులో లంచాల కేసులు కూడా ఎదుర్కొన్న గత పాలకుల తీరే ఈరోజు సంక్షోభానికి మూలం. ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలతో పాటు, బార్బర్ సెలూన్లు, చేనేత వర్కింగ్ షెడ్లు, ఆక్వా రైతులకు సబ్సిడీతో విద్యుత్ అందిస్తున్నాం. ఆక్వా రంగానికి యూనిట్‌ను కేవలం రూపాయి 50 పైసలకే అందిస్తున్నాం. షార్ట్ టర్మ్ పవర్ కొనుగోళ్లు 17 శాతం నుండి 6.8 శాతానికి తగ్గించాం. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని వివరించారు. కౌన్సిల్ సమావేశంలో ఈ తగ్గింపు ప్రకటన చేయాలనుకున్నా, ప్రతిపక్షం కాఫీ, టీ గోలలతో అవరోధం సృష్టించిందని మంత్రి డోలా విమర్శించారు. ‘‘ప్రజా సమస్యల కంటే కాఫీ, టీ పట్ల ప్రతిపక్షం ఎక్కువ శ్రద్ధ చూపింది. అయినప్పటికీ మేము ఇచ్చిన హామీ ప్రకారం ఈ చార్జీ తగ్గింపును అమలు చేస్తాం. భవిష్యత్తులో ఇంకా తగ్గింపులకు కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.

విద్యుత్ ఛార్జీల తగ్గింపుతో తాడేపల్లికి షాక్! - Tholi Paluku