
విద్యుత్ ఘాతంతో గజరాజు మృతి
చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆహారం కోసం అడవి దాటి వచ్చిన ఓ గజరాజు విద్యుత్ తీగలకు బలైపోయింది. కల్లుపల్లి గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పుంగనూరు అటవీ ప్రాంతం నుంచి పలమనేరు అటవీ పరిధిలోకి ప్రవేశించే క్రమంలో సుమారు 30 ఏళ్ల వయస్సున్న ఓ మగ ఏనుగు ఆహారం కోసం వెతుకుతూ కల్లుపల్లి గ్రామ శివారులోని పొలాల్లోకి వచ్చింది. అటవీ ప్రాంతానికి కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉన్న ఈ వ్యవసాయ భూముల్లో తిరుగుతుండగా ప్రమాదవశాత్తు అక్కడ వేలాడుతున్న విద్యుత్ వైర్లు ఏనుగు తాకింది. లైవ్ వైర్ల నుంచి భారీస్థాయిలో విద్యుత్ ప్రవహించడంతో ఆ గజరాజు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
విషయం తెలుసుకున్న చిత్తూరు జిల్లా అటవీ అధికారి జి. సుబ్బురాజ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతి చెందిన ఏనుగు కళేబరాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.
