Let's talk: editor@tmv.in
విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు సీపీఐ లేఖ

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు సీపీఐ లేఖ

FL - SUNL
4 అక్టోబర్, 2025

మన రాష్ట్రంలో అత్యంత కీలకమైనది విద్యుత్ రంగమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల ప్రధాన సమస్యలలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికుల సంఘటలో విలీనమవటం, ఉద్యోగ భద్రత కల్పించాలనే వల ఉద్దేశ్యంతో పలువురు చర్చలు జరిపినప్పటికీ యథా స్థితిగానే సమస్యలు పరిష్కారం కాలేదని వివరించారు. గత ఎన్నికలకు ముందు విద్యుత్ సంస్థలలోని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఈనెల 15వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లే నిర్ణయంతో ఇప్పటికే విద్యుత్ శాఖకు నోటీసులు ఇచ్చిందన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, నూతన పరిశ్రమలు నెలకొల్పాలన్నా, పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలన్నా నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. అలాంటి కీలక విద్యుత్ రంగంలోని ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలోకి వెళితే రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి, పంపిణీకు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీని ప్రభావం రైతులపై తీవ్రంగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీరు, త్రాగునీరు, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతోపాటు సాధారణ ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందని లేఖలో సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ఇప్పటికే ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తమ సమస్యలపై యాజమాన్యంతో అనేక సార్లు చర్చలు, సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం శూన్యమని పేర్కొన్నారు. కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, సమ్మెను నివారించేందుకు తగు చర్యలు చేపట్టాలని లేఖలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విజ్ఙప్తి చేశారు.

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై సీఎంకు సీపీఐ లేఖ - Tholi Paluku