


విద్యా హబ్‌గా ‘ఆదిలాబాద్’ జిల్లాను మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
దక్షిణ భారతదేశంలో అక్షరాభ్యాసానికి అత్యంత ప్రసిద్ధి గాంచిన క్షేత్రం, తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ఈ ఆలయ అభివృద్ధి పనులకు ఘనంగా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 225 కోట్లతో ఈ చారిత్రక క్షేత్రాన్ని పునరుద్ధరించి, భక్తులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు.
ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన మనవడికి అక్షరాభ్యాసం చేయించడం విశేషం. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతీ క్షేత్రాన్ని సమగ్రంగా పునర్నిర్మించి, భక్తుల రద్దీకి అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు కల్పించడమే ఈ భారీ నిధుల కేటాయింపు ప్రధాన ఉద్దేశ్యం. ఈ అభివృద్ధి పనుల ద్వారా బాసర క్షేత్రం ఆధ్యాత్మికంగా, పర్యాటక పరంగా మరింత శోభను సంతరించుకోనుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి సరికొత్త విజన్
పిప్రిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను 2034 నాటికి దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక వాడగా, పర్యాటక కేంద్రంగా, విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. జిల్లాలో బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు లేని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల పట్ల తారతమ్యం లేకుండా, ఎవరి పట్ల వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావిస్తూ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు ప్రజల అవసరాల ఆధారంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పార్టీలను కాకుండా ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
2034 నాటికి ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామిక, పర్యాటక, విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని సీఎం వెల్లడించారు. జిల్లాలో ఖనిజ సంపద, జల వనరులు, సంస్కృతి సమృద్ధిగా ఉన్నప్పటికీ గతంలో సరైన ప్రణాళికలు లేక వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో లోటుపాట్లు ఉన్నాయని గుర్తుచేశారు. జిల్లా అభివృద్ధి కోసం అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరిపామని, ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితుల నేపథ్యంలో, గడువు తర్వాత జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మేము పాలకులం కాదు, ప్రజలకు సేవకులం అని పేర్కొంటూ, ప్రతి రెండు నెలలకు ఒకసారి జిల్లాను సందర్శిస్తానని సీఎం వెల్లడించారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునఃప్రారంభించి సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్రంతో చర్చలు కొనసాగుతున్నాయని, జూన్ 2 లోపు శిలాఫలకం వేయడానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. బాసర సరస్వతి ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు అందిస్తామని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం భూసేకరణ చర్యలు చేపడతామని వెల్లడించారు.
సహాయ సంఘాలకు సహకారాలు
చివరగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 30,149 స్వయం సహాయక సంఘాలకు రూ. 53.50 కోట్ల చెక్కును సీఎం అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన నలుగురు సర్పంచులకు ఐఎస్ఓ సర్టిఫికేట్లను, సీఎం కప్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజా పక్షపాతిగా 'ఇందిరమ్మ' ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి
పిప్రి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తాము పాలకులం కాదని, ప్రజల సేవకులమని నమ్మి పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్ల క్రితం (2023 మార్చి 16న) ఇదే పిప్రి గ్రామం నుంచి తాను ప్రారంభించిన 'పీపుల్స్ మార్చ్' పాదయాత్రను భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. మండుటెండల్లో ప్రజలు తనతో నడిచిన అడుగులు, చూపిన మమకారం మరువలేనని ఆయన అన్నారు. నాడు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సుమారు రూ.1,238 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు ప్రకటించారు.
పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్, త్రివేణి సంగమం, అమ్మనమడుగు మినీ రిజర్వాయర్, కొమురం భీమ్ ప్రాజెక్ట్, పులిమడుగు వాగు వంటి కీలక ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను విడుదల చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి వంటి గ్యారెంటీలను కేవలం రెండేళ్లలోనే 99 శాతం అమలు చేశామని ఆయన ప్రకటించారు. అధికారం తమ దృష్టిలో హోదా కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అంతరాలు లేని సమాజాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, ప్రతి బిడ్డ ఈ గడ్డపై పుట్టినందుకు గర్వపడేలా ప్రజా కేంద్రీకృత పాలనను కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం కేవలం రాజకీయ సభ కాదని, ప్రజలతో పెనవేసుకున్న బంధానికి, ఇచ్చిన మాటకు కట్టుబడి చేస్తున్న ఆత్మీయ కార్యక్రమమని ఆయన ముగించారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో అభివృద్ధి జాతర
జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది.అలాగే రైతాంగానికి సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా,బోథ్ నియోజకవర్గం అడేగామా, నిర్మల్ జిల్లా దిలావర్పూర్‌లో చెరో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లకు శంకుస్థాపన చేశారు.
• జైనథ్‌లో బీసీ గురుకుల భవనం రూ.20 కోట్లు,
• ఆదిలాబాద్‌లో మైనారిటీ రెసిడెన్షియల్ భవనం రూ.20 కోట్లు
• పొచ్చెరకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ రూ.45.15 కోట్లు
• ఉట్నూర్‌లో నూతన ఐటీడీఏ భవన నిర్మాణానికి రూ.15 కోట్లు
సాగునీరు, విద్యుత్
రైతాంగానికి సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పిప్రి (రూ.50.70 కోట్లు), తేజాపూర్ (రూ.44.64 కోట్లు) ఎత్తిపోతల పథకాలతో పాటు, ఇంద్రవెల్లిలో ముత్నూర్ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ (రూ.65.85 కోట్లు) పనులకు శ్రీకారం చుట్టారు. కొండాపూర్ వద్ద నూతన వంతెనను ప్రారంభించగా, ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్‌లలో మూడు కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నాగోబా దేవస్థానం అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.20.10 కోట్లతో పనులను ప్రారంభించారు. వీటితో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.30 కోట్లతో చేపట్టనున్న 38 రకాల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
