
విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను బలోపేతం చేయడంతో పాటు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు.
ముఖ్యమంత్రి సమక్షంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ మధ్య ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ (ఐ.డీ.ఈ.ఏ) ఏర్పాటు కోసం కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందంపై కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు, సీఈఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్,అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన విద్యా సంస్కరణల వైపు మరో అడుగుగా పేర్కొన్నారు.
డిజిటల్ యూనివర్సిటీగా అభివృద్ధి
ఈ ఒప్పందం ఫలితంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందనుందని, ఆధునిక విద్యా సాంకేతికతను వినియోగించి, బోధన,అభ్యాస విధానాల్లో నాణ్యతను పెంపొందించడానికి ఐ.డీ.ఈ.ఏ ఒక అత్యాధునిక డిజిటల్ హబ్‌గా పనిచేయనుందని సీఎం తెలిపారు.విద్యార్థులకు స్మార్ట్ లెర్నింగ్ వనరులు, వర్చువల్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ రీసెర్చ్ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని. ప్రపంచ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యను తెలంగాణ విద్యార్థులు సులభంగా పొందేందుకు ఈ అకాడమీ ముఖ్య పాత్ర పోషించనుందని సీఎం తెలిపారు.సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చదువు మరింత అందుబాటులోకి రావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఉన్న విద్యార్థులందరికీ సమానమైన విద్య నేర్చుకునే అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాలకు అవసరమైన స్కిల్స్‌ను, అనుభవాలను అందించడంలో ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని సీఎం తెలిపారు.
మైక్రో-క్రెడెన్షియల్ కోర్సులు
డా. బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ సహకారంలో భాగంగా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యాపక బృందం జనవరి 12, 2024 నాడు 7 ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, 8 మైక్రో-క్రెడెన్షియల్ కోర్సులను ప్రారంభించింది.
