
విద్యా రంగానికి 'ప్రజా పాలన' పెద్దపీట: మంత్రి పొన్నం
రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలను పెంచినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణపై రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి పేర్కొన్నారు. నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. గురుకులాల హాస్టళ్లకు సంబంధించిన అద్దెలు, ఇతర బకాయిలను ఆలస్యం లేకుండా ‘గ్రీన్ ఛానెల్’ విధానం ద్వారా చెల్లిస్తున్నామని తెలిపారు.
సోమవారం శాసనసభలో మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ప్రజాపాలనలో తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా, బలహీన వర్గాల సంక్షేమాన్ని కేవలం హామీలకే పరిమితం చేయకుండా, ఆచరణాత్మకంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యంగా విద్యారంగాన్ని బలపరచడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.
విదేశీ విద్యకు ప్రోత్సాహం
దేశీయ విద్య స్కాలర్‌షిప్‌ల సంఖ్యను గతంలో ఉన్న 300 నుండి ప్రస్తుతం 700కు పెంచామని మంత్రి తెలిపారు. దీని వల్ల అధిక సంఖ్యలో పేద, ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలు కల్పించబడుతున్నాయని అన్నారు. అదే విధంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విద్యను పొందే అవకాశం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్
రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లను ఖర్చు చేస్తూ ఆధునిక సౌకర్యాలతో నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ పాఠశాలలు భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యను అందించే కేంద్రాలుగా మారనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బీసీ సంక్షేమానికి భారీ కేటాయింపులు
బీసీ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో రూ.11,000 కోట్లను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. బలహీన వర్గాల విద్య, ఉపాధి, రాజకీయ ఎదుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సమాన అవకాశాల సమాజ నిర్మాణమే తమ ధ్యేయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
