Let's talk: editor@tmv.in
విద్యాసంస్థల్లో ఎన్విరాన్‌మెంట్ క్లబ్‌లు తప్పనిసరి: హైడ్రా కమిషనర్

విద్యాసంస్థల్లో ఎన్విరాన్‌మెంట్ క్లబ్‌లు తప్పనిసరి: హైడ్రా కమిషనర్

Sirisha B
11 ఏప్రిల్, 2026

విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న సాంస్కృతిక, క్రీడా విభాగాల మాదిరిగానే ప్రతి విద్యాసంస్థలోనూ తప్పనిసరిగా ‘ఎన్విరాన్‌మెంట్‌ క్లబ్‌’లను ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పిలుపునిచ్చారు. హైటెక్స్‌లో సీబీఐటీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘మోడల్ యునైటెడ్ నేషన్స్-2026’ కార్యక్రమానికి ఆయన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విద్యార్థి దశ నుంచే అవగాహన…

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. మెరుగైన భవిష్యత్తు, ఆరోగ్యకరమైన వాతావరణం కావాలంటే విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై బాధ్యత పెంచాలన్నారు. “పర్యావరణ క్లబ్‌ల ద్వారా చెట్లు నాటడం, జలవనరుల రక్షణ, ప్లాస్టిక్ నివారణపై విద్యార్థుల్లో చైతన్యం తేవాలి. ప్రతి విద్యార్థి ప్రకృతి పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాలి” అని పేర్కొన్నారు.

హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ.. చెరువులు, కుంటలు, పార్కులు మరియు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నామని రంగనాథ్‌ వెల్లడించారు.

• ఇప్పటివరకు సుమారు రూ. 70,000 కోట్ల విలువైన ప్రజా ఆస్తిని ఆక్రమణల నుంచి కాపాడామని తెలిపారు.

• గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, వరద కాలువల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతోందని వివరించారు.

• చెరువుల పునరుద్ధరణ ద్వారానే వరద ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి కర్తవ్యమని స్పష్టం చేశారు. హైడ్రా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాల్లో విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొ. సీవీ నరసింహులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

విద్యాసంస్థల్లో ఎన్విరాన్‌మెంట్ క్లబ్‌లు తప్పనిసరి: హైడ్రా కమిషనర్ - Tholi Paluku