
విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి: వైఎస్సార్‌సీపీ
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నేతలు శుక్రవారం విజయవాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించారు.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పేరుతో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఉద్యోగాలను దొడ్డిదారిన ఉద్యోగాలను అమ్ముకున్నారని పేర్కొంటూ, నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ, దీనిని "మెగా డీఎస్సీ"గా కాకుండా "దగా డీఎస్సీ"గా అభివర్ణించారు. డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని, నిరుద్యోగ యువత మంత్రి లోకేష్ రాజీనామాను కోరుతోందని అన్నారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, క్రీడాకోటా కింద జరిగిన నియామకాలలో కూడా తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. బంగారు పతకాలు సాధించిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వకుండా, కేవలం పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగి ఉంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు.
డీఎస్సీ వ్యవహారంపై తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఆగస్టు 3, 4 తేదీల్లో టౌన్‌హాల్ సమావేశాలు, ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, ఆగస్టు 10న రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు దేవినేని అవినాష్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా మెగా డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నాపత్రాల లీకులు, నియామకాల్లో అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆయన కూడా డిమాండ్ చేశారు.
