Let's talk: editor@tmv.in
విద్యార్థుల స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ డిమాండ్

విద్యార్థుల స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ డిమాండ్

Gaddamidi Naveen
9 డిసెంబర్, 2025

తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.10,000 కోట్ల పెండింగులో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలన్న డిమాండ్ కు ప్రతీకగా సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి నాయకుడు రాజేష్ దత్త చేపట్టిన ఖమ్మం నుంచి హైదరాబాద్ 250 కిలోమీటర్ల మహా పాదయాత్ర సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా హిమాయత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రాజేష్ దత్తను అభినందించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హంగూ ఆర్భాటాలకు, అంతర్జాతీయ సమ్మిట్లకు, అందాల పోటీలకు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోందని, అదే సమయంలో వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను మాత్రం విడదీయకుండా పెట్టిందని ఆయన పేర్కొన్నారు.

అలాగే బడా కాంట్రాక్టర్లకు ఇచ్చే భారీ బిల్లులను తాత్కాలికంగా నిలిపివేసి, ముందు విద్యార్థుల బకాయిలను క్లియర్ చేయడం ప్రభుత్వ ధర్మం అని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులు నడపలేని స్థితికి చేరుకున్నారని, అనేక మంది విద్యార్థులు కాలేజీల నుంచి నోటీసులు అందుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర లక్ష్యం అన్ని సామాజిక వర్గాల విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమేనని తెలిపారు. స్కాలర్‌షిప్ బకాయిల కారణంగా అనేక మంది ఉన్నత విద్యార్థులు చదువులు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘానికి చెందిన విద్యార్థి నాయకుడు వేముల రామకృష్ణ, ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పాదయాత్రకు పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజనాలు మద్దతు తెలిపినట్లు నిర్వాహకులు తెలిపారు.

విద్యార్థుల స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ డిమాండ్ - Tholi Paluku