
విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్:
రాష్ట్రంలోని పాఠశాల, కళాశాల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యంగా 13 నుంచి 19 ఏళ్ల లోపు ఉండే కౌమార విద్యార్థుల శారీరక, మానసిక వికాసం కోసం ‘ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ వెల్నెస్ ప్రోగ్రాం’ ( ఏపీఎస్ హెచ్ డబ్ల్యూపీ ) పేరుతో ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ను రూపొందించింది. దేశంలోనే తొలిసారిగా కౌమార దశలోని విద్యార్థుల కోసం ఇలాంటి ప్రత్యేక వేదికను తీసుకురావడం ద్వారా వైద్య సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కొత్త ఒరవడిని సృష్టించినట్లయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.
సాధారణంగా విద్యార్థులు తమకు ఎదురయ్యే శారీరక మార్పులు, వ్యక్తిగత సమస్యలపై అవగాహన కోసం సామాజిక మాధ్యమాలు లేదా ఇతరత్రా మార్గాలపై ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో విశ్వసనీయత లేని సమాచారంతో వారు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం, శాస్త్రీయమైన సమాచారాన్ని నేరుగా విద్యార్థులకే అందించేలా ఈ పోర్టల్‌ను (apshwp.ap.gov.in) తీర్చిదిద్దింది. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే ‘ప్రివెన్షన్’ (ముందస్తు నివారణ) పద్ధతిలో విద్యార్థులను చైతన్యపరచడమే లక్ష్యంగా ఈ వెబ్ వేదిక పనిచేస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారం, మానసిక ఉల్లాసం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణ వంటి 11 ప్రధానాంశాలపై ఇందులో లోతైన సమాచారం నిక్షిప్తమై ఉంది.
ఈ పోర్టల్‌లో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా 15 నిమిషాల నిడివి గల ఆసక్తికరమైన వీడియో పాఠాలను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంచారు. ఇద్దరు విద్యార్థులు పరస్పరం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా వినూత్న శైలిలో ఈ పాఠాలను రూపొందించడం విశేషం. బాలికల రుతుక్రమ సమస్యలు, సోషల్ మీడియా మితిమీరిన వినియోగం వల్ల కలిగే నష్టాలు, ఇంటర్నెట్ భద్రత వంటి అంశాలను ఇందులో చర్చించారు. కేవలం సమాచారం చూడటమే కాకుండా ఈ-లెర్నింగ్ విధానంలో క్విజ్ పోటీలు, ఆటలు నిర్వహించి, ఆన్‌లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సర్టిఫికెట్లను కూడా జారీ చేయనున్నారు.
ఈ బృహత్తర కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర కిశోర ఆరోగ్య కార్యక్రమం కింద ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లకు ‘డిజిటల్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’పై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో సుమారు 150 మంది చొప్పున టీచర్లకు శిక్షణ ఇచ్చామని మీరు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
