
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకే ‘ముస్తాబు’: సీఎం చంద్రబాబు
చిన్న చిన్న ఆలోచనలు సమాజంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయని, అలాంటి ఆలోచనల ఫలితమే ‘ముస్తాబు’ కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం ఆయన ‘ముస్తాబు’ వ్యక్తిగత పరిశుభ్రత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించారు.
తెలుగులో ‘సిద్ధమవడం’ అనే అర్థం వచ్చే ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని గిరిజన విద్యార్థుల మధ్య మొదటగా ప్రయోగాత్మకంగా అమలు చేసిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆలోచనతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. తాళ్లపాలెం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో సీఎం కొద్దిసేపు ముచ్చటించారు. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్న విధానాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ముస్తాబు కార్యక్రమ లక్ష్యం. పాఠశాలకు చక్కటి యూనిఫారంతో పరిశుభ్రంగా హాజరై చదువుకోవాలి అని సూచించారు.
ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో శ్రద్ధ, క్రమశిక్షణ పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. తల సరిగా దువ్వుకోవడం, భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెద్దగా ఖర్చు అవసరం లేకపోవడం విశేషమని చెప్పారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్ వరకు సుమారు 75 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని ముస్తాబు వంటి కార్యక్రమాల ద్వారా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మంది విద్యార్థులకు త్వరలోనే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని, వారికి పౌష్టికాహారం అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
విద్యార్థులే రాష్ట్రానికి అసలైన ఆస్తి అని, వారు నాలెడ్జ్ ఎకానమీలో భాగస్వాములు కావాలని సీఎం ఆకాంక్షించారు. తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుందని చెప్పారు. ‘తల్లికి వందనం’ కింద ఆర్థిక సాయం అందించడంతో పాటు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, భోజనం ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే చిన్న వయస్సు నుంచే కృషి చేయాలని హితవు పలికారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యాశాఖలో వినూత్న సంస్కరణలు అమలవుతున్నాయని అన్ని శాఖల మంత్రులు విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చేందుకు కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కొన్ని ఆలోచనలు అందరిలో మార్పును తీసుకొస్తాయి. అలాంటి కార్యక్రమమే ముస్తాబు. అందుకే దీన్ని అన్ని చోట్ల అమలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
