
విద్యార్థులే భావి భారత నిర్మాతలు: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
బంజారాహిల్స్‌లోని బీజేఆర్ భవన్‌లో శనివారం ఐవిజన్ యూత్ పార్లమెంట్–2025 గ్రాండ్ ఫినాలే అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి నేతృత్వంలో హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం ఈ వినూత్న పౌర విద్యా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ యూత్ పార్లమెంట్‌లో పాల్గొన్న విద్యార్థులను భవిష్యత్ నాయకులు మార్పు తీసుకొచ్చే యువతగా అభివర్ణించారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు దేశ భవిష్యత్తును నిర్ణయించే అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థలని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, ఇటువంటి యూత్ పార్లమెంట్ల ద్వారా అనుభవపూర్వక అభ్యాసాన్ని పొందాలని సూచించారు.
శ్వేతపత్రంపై ప్రశంసలు
విద్యార్థులు స్వయంగా రూపొందించిన శ్వేతపత్రాన్ని గవర్నర్ ప్రశంసించారు. ఇది ప్రస్తుత తరం భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలకు ప్రతిరూపమని, ఇందులో పాలన, అభివృద్ధికి సంబంధించిన సమకాలీన అంశాలను అద్భుతంగా విశ్లేషించారని కొనియాడారు. ముఖ్యంగా బాలికలు 80 శాతం మేర పాల్గొనడం చూస్తుంటే, భారతదేశంలో మహిళా సాధికారత ఒక నిశ్శబ్ద విప్లవంలా సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఇది యువతుల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాలకు నిదర్శనమని అన్నారు. విద్యార్థులే స్వయంగా రూపొందించిన వైట్ పేపర్‌ను,(శ్వేతపత్రం) విజన్–2047 కోసం వారి ఆలోచనలు, ఆకాంక్షలను సమిష్టిగా ప్రతిబింబించే పత్రంగా అభినందించారు. ఆ పత్రం ద్వారా విద్యార్థులు పొందిన అర్థవంతమైన అభ్యాసం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
రాజకీయాల్లో యువత పాత్ర
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యూత్ పార్లమెంట్, మోక్ అసెంబ్లీ మోడల్ యునైటెడ్ నేషన్స్ వంటి కార్యక్రమాలు విద్యార్థులకు శాసన ప్రక్రియలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజాస్వామ్య ప్రయోగశాలగా తరగతి గది
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్లాస్ రూమ్ బోర్డులకు పరిమితం కాకుండా, విద్యార్థులు చర్చలు, విశ్లేషణలు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలనే ఉద్దేశంతో 'ఐవిజన్ యూత్ పార్లమెంట్'ను రూపొందించినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 183 ప్రభుత్వ పాఠశాలలు, 50 ప్రైవేట్ పాఠశాలల నుండి 2,000 మందికి పైగా విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు. వీరు 2047 నాటికి భారతదేశం ఎలా ఉండాలనే దానిపై తమ ఆలోచనలను పంచుకున్నారు.
అదేవిధంగా, యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో, రాష్ట్ర విజన్–2047కు అనుగుణంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ అనుకరణ సమావేశాల్లో, అలాగే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ పై కేంద్రీకృతమైన మోడల్ యునైటెడ్ నేషన్స్ సమావేశాల్లో విద్యార్థులు చూపిన క్రమశిక్షణ, మర్యాద, పార్లమెంటరీ విధానాలకు కట్టుబాటును ఆమె ప్రశంసించారు. ఇటువంటి అనుభవాత్మక కార్యక్రమాలు అవగాహన కలిగిన పౌరసత్వాన్ని పెంపొందించడంలో, ప్రజాస్వామ్య భవిష్యత్తును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గవర్నర్ అవార్డులు, సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
