Let's talk: editor@tmv.in
విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ సెషన్‌ - హాజరైన ముఖ్య మంత్రి చంద్రబాబు

విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ సెషన్‌ - హాజరైన ముఖ్య మంత్రి చంద్రబాబు

Dantu Vijaya Lakshmi Prasanna
27 నవంబర్, 2025

రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) ను పురస్కరించుకుని విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ సెషన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పాల్గొన్నారు.

స్పీకర్, ఐటీ మంత్రి, ఇతర మంత్రులు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి, విద్యార్థులు ఎమ్మెల్యేలు, మంత్రులు ,స్పీకర్‌గా పాత్రలు పోషించి మాక్ అసెంబ్లీ నిర్వహించడాన్ని తిలకించారు. చీరలు, ఫార్మల్ దుస్తులు ధరించి, విద్యార్థులు శాసనసభ్యుల్లా చురుకుగా ప్రశ్నలు అడిగారు.

నిజమైన అసెంబ్లీని పోలి ఉండేలా, రాష్ట్ర ప్రభుత్వం పంచుకున్న వీడియో లింక్ ప్రకారం, చాలా మంది విద్యార్థులు నిజమైన శాసనసభ్యుల మాదిరిగానే ప్రశ్నలు, సమాధానాలు తర్వాత డెస్క్‌లను చరిచారు, ఇతర కార్యకలాపాలను కూడా నిర్వహించారు.

అనంతరం రాజ్యాంగ దినోత్సవాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ....

విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించిన తీరు చాలా అభినందనీయం. 175 నియోజవకర్గాల నుంచి ఎంపికై మాక్ అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గం తరపున ప్రాతినిధ్యం వహించినందుకు సంతోషంగా ఉంది. స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీని అదరగొట్టారు...చాలా బాగా రాణించారన్నారు.

అసెంబ్లీ ఆదర్శంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. విద్యార్థులు తక్కువ సమయంలోనే ఏ విధంగా ప్రవర్తించాలో అనుసరించి వండర్ ఫుల్ గా వ్యవహరించారు. ప్రతి ఒక్కరిలో బాధ్యత, చైతన్యం రావడానికి సంవిధాన్ దివస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం మన కోసం మనం భారత రాజ్యాంగాన్ని రాసుకున్నాం. 28 ఏళ్లకే నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని కోరుకున్నాను. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ గా చేరాలని అడిగితే...లెక్చరర్‌గా రాను ఎమ్మెల్యే అవుతానని చెప్పాను అంటూ ఆ రోజులను తలచుకున్నారు.

1978లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి కనబడతానని చెప్పి గెలిచి చూపించాను. ఐఏఎస్ అవ్వాలంటే ఎంతో ప్రిపేర్ అవ్వాలి. అదే నేను రాజకీయాల్లోకి వస్తే ఐఏఎస్‌లను కంట్రోల్ చేయవచ్చని ఆలోచించాను. నిరంతరం శ్రమ చేయాలి. ప్రతి ఒక్కరికీ సంక్షోభాలు వస్తాయి...వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. సరైన నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలి. అలా ఉండబట్టే నేను 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. 30 ఏళ్లకే నేను మంత్రి అయ్యాను..40 ఏళ్లకు సీఎం అయ్యానన్నారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యారు. నా కంటే చిన్న వయసులోనే మీరు మాక్ అసెంబ్లీకి వచ్చి సమర్థవంతంగా నిర్వహించారు. మా ఎమ్మెల్యేలు తడబడ్డా...మీరు మాత్రం తడబడలేదు. మీ కాన్ఫిడెన్స్‌కు అభినందనలు అని వారిని కొనియాడారు.

అసెంబ్లీని మరిపించేలా సెటప్ వేసి మీ అందిరినీ ఎమ్మెల్యేలుగా చూస్తున్నాం. బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించుకున్నాం. రాజ్యాంగాన్ని అంబేద్కర్ అద్భుతంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారు. దేశానికి ఆత్మగా భారత రాజ్యాంగం నిలిచింది. 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల పాటు సుధీర్ఘంగా చర్చించి రాజ్యాంగాన్ని రూపొంచింది ఆమోదించుకున్నాం. అనేక ఒడిదుడుకులు వచ్చాయి. ఎమర్జెన్సీని కూడా ఎదుర్కొన్నాం. అయినా రాజ్యాంగం మనుగడ సాధించడం వెనక కారణం రాసిన విధానం అని చంద్రబాబు అన్నారు.

ఓటు హక్కు మనకు వజ్రాయుధం

రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వారు మంచి వారు కాకపోతే చెడుఫలితాలను ఇస్తుంది. రాజ్యాంగం అమలు చేసే వారు మంచి వారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని అంబేద్కర్ స్పష్టంగా చెప్పారన్నారు. భారత రాజ్యాంగం నేను మీ అందరికీ ఆయుధాన్ని ఇస్తున్నాను...అది ఓటు హక్కు అని చెప్పిందన్నారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఓటు అవకాశం కల్పించిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అంటూ రాజ్యాంగాన్ని ప్రశంసించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మన దేశంలో ఓటు హక్కు ఉంటుంది. కొన్ని దేశాల్లో బలహీన వర్గాలకు ఓటు అవకాశం లేదు, పోరాడి తెచ్చుకున్నారు. మరి కొన్ని దేశాల్లో మహిళలు ఓటుకోసం పోరాడారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో మొన్నే బిల్లు కూడా పాస్ అయింది. అమెరికాలో ఒక మహిళ ఆ దేశ అధ్యక్షురాలు కాలేకపోయింది...కానీ భారతదేశంలో మహిళ ప్రధాని అయ్యారన్నారు.

ఓటు హక్కు మనకు వజ్రాయుధం. మన భవిష్యత్ కు మనం రూపకల్పన చేసుకోవచ్చు అంటూ ముగించారు.

విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ సెషన్‌ - హాజరైన ముఖ్య మంత్రి చంద్రబాబు - Tholi Paluku