
విద్యార్థులకు 'సీపీఆర్' శిక్షణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
గుండె సంబంధిత వ్యాధుల నివారణే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక సమిష్టి ఉద్యమంలా పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా కార్డియాలజిస్టులు, వైద్య నిపుణులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యార్థులు, యువతకు సీపీఆర్ వంటి ప్రాథమిక ప్రాణరక్షణ శిక్షణ ఇవ్వగలిగితే, దేశవ్యాప్తంగా వేలాది ప్రాణాలను కాపాడగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్-2026’లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు దక్షిణాసియా దేశాల నుంచి దాదాపు 500 మంది ప్రముఖ కార్డియాలజిస్టులు, వైద్య నిపుణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను వృత్తిపరంగా డాక్టర్ కాకపోయినా, తన పదవీ బాధ్యతల ద్వారా ‘సామాజిక వైద్యుడి’ పాత్రను పోషిస్తూ సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. సీపీఆర్ వంటి ప్రాణరక్షణ విధానాలపై ప్రజల్లో అవగాహన పెంచగలిగితే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని, అత్యవసర పరిస్థితుల్లో అనేక మంది ప్రాణాలు నిలబడతాయని అన్నారు.
వైద్యులు మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను ఎప్పటికీ మర్చిపోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్య సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా విధానాలను మరింత మెరుగుపరచేందుకు వైద్య నిపుణులతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. వైద్యులు తమ విలువైన సూచనలు, అభిప్రాయాలు ప్రభుత్వానికి అందించాలని కోరారు.
ఆరోగ్య సంరక్షణ రంగంలో నాణ్యత అత్యంత కీలకమని, ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అత్యుత్తమ వైద్యుడిగా ఎదగాలని, నిరంతర అభ్యాసం, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. వైద్య వృత్తి సాధించలేని వారు చాలామందే ఉన్నా, వైద్యులు సమాజంలో ఒక ప్రత్యేక వర్గమని, వారి సంరక్షణలో ఉన్నప్పుడు ప్రజలు తమ ప్రాణాలపై పూర్తి నమ్మకం ఉంచుతారని అన్నారు.
లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్, అనుబంధ రంగాల్లో హైదరాబాద్ వేగంగా ప్రపంచస్థాయి హబ్‌గా ఎదుగుతోందని పేర్కొంటూ, ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సదస్సు నగరంలో నిర్వహించడం గర్వకారణమన్నారు. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలతో ఆరోగ్య రంగం వేగంగా మారుతోందని, వైద్యులు నిత్య విద్యార్థుల్లా కొత్త పరిజ్ఞానంతో అప్డేట్‌గా ఉండాలని సూచించారు.
అయితే హైటెక్ వైద్యంతో పాటు హైటచ్ మానవీయత కూడా తప్పనిసరిగా ఉండాలన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, వైద్యులు రోగులతో మమేకమయ్యే మానవీయ స్పర్శను కోల్పోకూడదని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
