Let's talk: editor@tmv.in
విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ‘చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్’: మంత్రి పొన్నం

విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ‘చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్’: మంత్రి పొన్నం

Gaddamidi Naveen
1 ఫిబ్రవరి, 2026

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా, అబిడ్స్‌లోని అలియా ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. సుమారు 14 లక్షల రూపాయల వ్యయంతో రవాణా శాఖ ఈ పార్కును అత్యాధునికంగా నిర్మించింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థు దశ నుంచే రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడమే ఈ పార్కు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.చిన్న వయసులోనే ట్రాఫిక్ నిబంధనలను నేర్చుకుంటే భవిష్యత్తులో ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన అన్నారు.

పార్క్‌లో రవాణా శాఖ అధికారులు విద్యార్థులకు రోడ్డు భద్రత నిబంధనలపై ప్రాయోగికంగా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఎలా పాటించాలి, జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులు ఎలా వ్యవహరించాలి, హాస్పిటల్ ప్రాంతాల్లో వాహనాల వేగం ఎలా తగ్గించాలి వంటి అంశాలను వివరించారు. అలాగే అటవీ ప్రాంతాలు, జంక్షన్లు, రోడ్డు డివైడర్లు, పాఠశాలల సమీపంలోని రోడ్డు క్రాసింగ్ ప్రాంతాల్లో పాటించాల్సిన జాగ్రత్తలను విద్యార్థులు స్వయంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాలపై స్పష్టమైన అవగాహనతో పాటు బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలనే భావన పెరుగుతుందని అధికారులు తెలిపారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.