
విద్యార్థి నాయకులపై పెట్టిన రౌడీషీట్లను తక్షణమే ఎత్తివేయండి: యువజన సంఘాల ధర్నా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని విద్యార్థి, యువజన సంఘాల నేతలు మండిపడ్డారు. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాలతో పాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని, సంకెళ్లు వేసుకున్నట్టుగా ప్రదర్శన చేస్తూ వినూత్న నిరసన చేశారు. రాష్ట్రంలో విద్యార్థి నేతలపై అక్రమంగా రౌడీషీట్లు ఓపెన్ చేయడం ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులతో వేధించడం లోకేష్ నేతృత్వంలోని అరాచక పాలనకు నిదర్శనమని నాయకులు ఎ. రవిచంద్ర, పి. రాజేంద్ర బాబు పేర్కొన్నారు.
హామీల అమలు అడిగితె జైలుకా?
ఎన్నికల సమయంలో నిరుద్యోగులను ఊరించిన మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదని నేతలు ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను తామేమీ అడగడం లేదని కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడిగితే అక్రమంగా జైలుకు పంపడం దుర్మార్గమని విమర్శించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన రౌడీషీట్లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారిని నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు.
లోకేష్ మాట తప్పారు.. 19 నెలలైనా అతీగతీ లేదు
నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తే విద్యార్థి నేతలపై కేసులు ఉండవు సమస్యలు నేరుగా నాకే చెప్పండి అన్న మాటలను నేతలు గుర్తు చేశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అని చెప్పి నేడు అధికారంలోకి వచ్చి 19 నెలలవుతున్నా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలంటే లోకేష్‌కు ఎందుకు అంత భయమని పోలీసు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. లాఠీలు, గృహ నిర్బంధాలు ప్రజాస్వామ్యంలో చెల్లవని ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి శివారెడ్డి, యువజన విభాగం నాయకులు మాతా మహేష్, కేసరి రాజశేఖర్ రెడ్డి నాయకులు ఐ. శ్రీనివాస్, రంజిత్, జగదీష్, నవీన్, ఉదయ్ రెడ్డి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
