
విద్యారంగ సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి యత్నం.. బీఆర్ఎస్వీ నేతల అరెస్ట్
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) సోమవారం ‘అసెంబ్లీ ముట్టడి’కి పిలుపునిచ్చింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి పంజాగుట్ట, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అరెస్ట్ అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యారంగానికి 18 శాతం నిధులు ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేస్తే, ప్రభుత్వం కేవలం 8 శాతం కే పరిమితం చేసిందని మండిపడ్డారు. రూ. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉంటే, బడ్జెట్‌లో కేవలం రూ. 4 వేల కోట్లే కేటాయించారని, ఇది విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను వంచించడమేనని ధ్వజమెత్తారు. రూ. 5 లక్షల విద్యా రుణం, 18 ఏళ్లు నిండిన బాలికలకు స్కూటీ పథకం, విద్యానిధి వంటి హామీల ఊసే బడ్జెట్‌లో లేదని విమర్శించారు.
ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనికి బాధ్యత వహిస్తూ రేవంత్ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అల్పాహారం, పాలు, జావ వంటి పథకాలను తమవిగా చెప్పుకోవడం కాంగ్రెస్ వైఖరికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బీఆర్ఎస్వీ పోరాటం ఆపదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్వీ నేతల అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై విరుచుకుపడటం అప్రజాస్వామికమని, ఇది దేశంలో 'ఎమర్జెన్సీ' రోజులను గుర్తు చేస్తోందని ఆయన విమర్శించారు.
తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నయవంచన చేసిందని మండిపడ్డారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని, దీనికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.127 మంది విద్యార్థులు గురుకులాల్లో మరణించినా సీఎం రేవంత్ రెడ్డిలో చలనం లేకపోవడం దారుణమన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్వీ నేతలను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
