Let's talk: editor@tmv.in
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి పొంగులేటి

విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి పొంగులేటి

Gaddamidi Naveen
14 డిసెంబర్, 2025

విద్యారంగంలో వస్తున్న నూతన మార్పులకు ఈటీ టెక్ ఎక్స్ వంటి వేదికలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని, టెక్నాలజీ, విద్య కలిసి భవిష్యత్తును ఎలా నిర్మించాలి అనే అంశంపై ఆలోచించి, చర్చించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దిశానిర్దేశం చేస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శ‌నివారం బ్రెయిన్ ఫీడ్ గ్రూప్ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో నిర్వహించిన ఈటీ టెక్ ఎక్స్ యొక్క 6వ ఎడిషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలో జరుగుతున్న మార్పులు, టెక్నాలజీ ఆధారిత పద్ధతులు విద్యార్ధులకు అందించాలనే దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రెండు సంవత్సరాలుగా విద్యారంగాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా గుర్తించి, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని మంత్రి అన్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధ్యాయుల భర్తీ, డిజిటల్ లెర్నింగ్, స్కిల్ ఎడ్యుకేషన్, విద్యా నాణ్యత పెంపు వంటి అంశాల్లో సమగ్ర మార్పులు చేపట్టడం ద్వారా రాష్ట్రంలో విద్యావ్యవస్థను సమూలంగా అభివృద్ధి చేస్తోందని ఆయ‌న పేర్కొన్నారు.

అలాగే కుల, మత భేదాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఒకే క్యాంపస్‌లో సౌకర్యాలతో చదువుకునేలా 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 21,000 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ విధానం రాష్ట్రంలో సమానమైన విద్యావకాశాలను అందించడమే కాక, సమాజంలోని అన్ని వర్గాల విద్యార్థులకు భవిష్యత్తులో సుస్థిర అవకాశాలను ఏర్పరుస్తుందని మంత్రి తెలిపారు.

ఈటీ టెక్ ఎక్స్ వంటి వేదికలు విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా మార్పులను పరిచయం చేయడం, టెక్నాలజీతో విద్యను సమన్వయపరచడం ద్వారా వారి సృజనాత్మకతను, ప్రతిభను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని. మంత్రి ఈ సదస్సును ముఖ్యంగా విద్యార్ధుల కోసం ఒక మార్గదర్శక వేదికగా అభివర్ణించారు. ఈటీ టెక్ ఎక్స్ 6వ ఎడిషన్ ద్వారా విద్యార్ధులు మాత్రమే కాక, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు కూడా సమకాలీన విద్యా మార్పులను విశ్లేషించి, భవిష్యత్తులో ఉపయోగకరమైన దిశానిర్దేశం పొందారు అని ఆయ‌న అన్నారు.విద్య, టెక్నాలజీ కలయిక ద్వారా సమగ్రమైన భవిష్యత్తును నిర్మించడంలో తెలంగాణ మోడల్ మరింత ప్రేరణగా నిలుస్తుందని మంత్రి సూచించారు.

విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి పొంగులేటి - Tholi Paluku