
విద్యతో పాటు నైతిక విలువలు అవసరం:రాష్ట్రపతి
ఏ దేశాభివృద్ధికైనా విద్యే పునాదని, విద్యార్థుల మేధస్సు, నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే కాకుండా, వారి నైతిక బలాన్ని వ్యక్తిత్వాన్ని బలోపేతం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మంగళవారం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో జరిగిన కుమాయూన్ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. చదువు నైపుణ్యాలనే కాకుండా నైతిక బలం, వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించాలని అన్నారు.
తమ విద్యను వెనుకబడిన వర్గాల సేవకు, దేశ నిర్మాణానికి అంకితం చేయాలని పిలుపునిచ్చారు. ఇదే నిజమైన ధర్మం, ఇది మీకు ఆనందం, సంతృప్తిని ఇస్తుందని పేర్కొన్నారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది
ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటిగా ఉందని ఆమె వివరించారు. యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు విధానాలను అమలు చేస్తున్నదని, ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులను ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. దేశాభివృద్ధికి పరిశోధన, ఆవిష్కరణ, వ్యాపార ఆరంభ రంగాలను ప్రోత్సహించడం అత్యంత అవసరమని రాష్ట్రపతి అన్నారు. విద్య, పరిశోధనల సమగ్రతకు బహుళ విధాన రంగాలు అవసరమన్నారు. కుమాయూన్ యూనివర్సిటీ ఈ దిశగా అడుగులు వేస్తోందని ప్రశంసించారు.
హిమాలయాలు జీవనాధార వనరుల నిలయం అని, వాటిని సంరక్షించడం అందరి బాధ్యత అని రాష్ట్రపతి చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు యూనివర్సిటీ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు సమీప గ్రామాలను సందర్శించి, గ్రామస్థుల సమస్యలను అర్థం చేసుకుని సరైన పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని ఆమె ఆకాంక్షించారు.
నైనాదేవి దర్శించుకున్న రాష్ట్రపతి
ఉత్తరాఖండ్‌లోని పవిత్ర శక్తిపీఠం శ్రీ మా నైనా దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేశంలో శాంతి, అభ్యుదయం, ప్రజల సంక్షేమం కోసం ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆమె ఆలయానికి రాగానే దేవస్థాన కమిటీ సభ్యులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్శనలో రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మిత్ సింగ్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము, రాజ్‌భవన్ ప్రధాన ద్వారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్ 125వ వార్షికోత్సవాన్ని గుర్తుచేశారు. ఉత్తరాఖండ్ సాంస్కృతిక, పరిపాలనా, చారిత్రక విలువలకు ప్రతీకగా నిలిచిన నైనిటాల్ రాజ్‌భవన్, తన విశిష్ట నిర్మాణ శైలి, ప్రకృతి సౌందర్యం, వారసత్వ సంపదతో ప్రత్యేక గుర్తింపు పొందిందని ఆమె పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా నవంబర్ 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి పలు అధికారిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అలాగే కైంచీ ధామ్‌లోని శ్రీ నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని కూడా దర్శించారు.
