Let's talk: editor@tmv.in
విద్యతోనే సామాజిక అసమానతల తొలగింపు: డిప్యూటీ సీఎం

విద్యతోనే సామాజిక అసమానతల తొలగింపు: డిప్యూటీ సీఎం

Gaddamidi Naveen
21 డిసెంబర్, 2025

సమాజంలో వేళ్లూనుకున్న అసమానతలను రూపుమాపే ఏకైక శక్తి విద్య మాత్రమేనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారం మేడ్చల్ జిల్లా అల్వాల్‌లోని లయోలా విద్యాసంస్థల గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవ) వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆత్మీయంగా గడిపిన ఆయన, రాష్ట్ర విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. ఐదు దశాబ్దాలుగా విద్యా రంగంలో లయోలా సంస్థలు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించే అత్యంత శక్తివంతమైన సాధనం విద్యేనని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధితో పాటు మానవ విలువలు కలిగిన విద్యను అందించడమే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విద్య కేవలం డిగ్రీలు సంపాదించడానికే పరిమితం కాకుండా, సమాజ బాధ్యతలు కలిగిన పౌరులను తీర్చిదిద్దే శక్తిగా మారాలని ఆయ‌న‌ అన్నారు.

విద్య - ఉపాధి రంగాల్లో కీలక సంస్కరణలు

యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ చర్యల ద్వారా యువత నైపుణ్యాలను పెంపొందించి, రాష్ట్ర జిడిపి వృద్ధికి గణనీయమైన దోహదం చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే, సమాన విద్యా అవకాశాలు అందించేందుకు 100 “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆయ‌న‌ వివరించారు.

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మూలధనం, ఆవిష్కరణ, ఉత్పాదకత అనే సూత్రాన్ని కేంద్రంగా చేసుకుని విధానాలు అమలు చేస్తున్నామని ఆయ‌న‌ అన్నారు. ఈ కార్యక్రమం చివరగా, ఐదు దశాబ్దాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసిన లయోలా విద్యాసంస్థల నిర్వాహకులు,ఉపాధ్యాయులు, విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

విద్యతోనే సామాజిక అసమానతల తొలగింపు: డిప్యూటీ సీఎం - Tholi Paluku