
విద్యకు 15 శాతం బడ్జెట్ కేటాయించాలి: దాసోజు శ్రవణ్ డిమాండ్
తెలంగాణలో విద్యావ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, ఎంవీ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి రెండేళ్లు గడిచినా, విద్యాశాఖ కోసం ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేకపోయారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ, ఇతర శాఖల పనులతో తీరిక లేకుండా ఉండి దీనిపై దృష్టి పెట్టడం లేదు అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల నిష్క్రమణ వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 15 శాతం బడ్జెట్ కేటాయించి విద్యావ్యవస్థను రక్షించాలని ఆయన కోరారు.
