
విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా గుట్టు రట్టు
విదేశీ సిగరెట్లను అక్రమంగా ఢిల్లీ మార్కెట్లోకి తరలించే ప్రయత్నం చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందం అరెస్ట్ చేసింది. అదేవిధంగా వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకుంది.
శనివారం తెల్లవారుజామున 1:10 గంటల సమయంలో క్రైమ్ బ్రాంచ్ అధికారులకు ఈ అక్రమ రవాణా గురించి రహస్య సమాచారం అందింది. ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని పాలం–ద్వారకా రోడ్డులోని బస్‌స్టాప్ వద్ద విదేశీ సిగరెట్ల కు సంబంధించి పెద్ద మొత్తంలో స్టాక్ చేరనున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇక తక్షణమే ప్రత్యేక బృందం ప్రహ్లాద్‌పూర్ ప్రాంతంలో ముట్టడి చేసి ఇద్దరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారు రిటైల్ మార్కెట్లో సరఫరా చేయడానికి సిద్ధం చేసిన భారీ సిగరెట్ల కన్సైన్‌మెంట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఈ సిగరెట్లు కంబోడియా నుండి అక్రమంగా ఢిల్లీలోని రిటైల్ మార్కెట్లలో తరలించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా స్వాధీనం చేసుకున్న సిగరెట్లపై భారత ప్రభుత్వం తప్పనిసరిగా ముద్రించాల్సిన ‘ఆరోగ్య హెచ్చరిక చిత్రాలు’ లేకపోవడం ఈ ఘటనకు కీలక ఆధారంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.
ఇక అరెస్టయిన వారిని ఢిల్లీకి చెందిన ప్రవీణ్ సెహగల్ ముఖేష్ ఖత్రేజాలుగా గుర్తించారు. స్వాధీనం చేసిన సరుకులో డేవిడాఫ్, డన్‌హిల్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన మొత్తం 66,400 సిగరెట్ స్టిక్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు క్రైమ్ బ్రాంచ్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
