Let's talk: editor@tmv.in
విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌తో చేతులు కలపాలి: ధర్మేంద్ర ప్రధాన్

విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌తో చేతులు కలపాలి: ధర్మేంద్ర ప్రధాన్

Pinjari Chand
3 మార్చి, 2026

వేగంగా ఎదుగుతున్న, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తున్న భారత విద్యా వ్యవస్థతో విదేశీ ఉన్నత విద్యా సంస్థలు భాగస్వామ్యం చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘స్టడీ ఇన్ ఇండియా ఎడ్యూ-డిప్లొమాటిక్ కాన్‌క్లేవ్ 2026’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో 50కి పైగా దేశాల రాయబారులు, హైకమిషనర్లు, విదేశీ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యే సమాజాలను కలిపే శాశ్వత వంతెన

అస్థిరతలు, వేగవంతమైన మార్పులతో కూడిన ప్రపంచంలో సమాజాలను కలిపే అత్యంత శాశ్వత వంతెన విద్యేనని ప్రధాన్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక దృశ్యంలో భారత్ ప్రకాశవంతమైన స్థానం దక్కించుకుంది. నేర్చుకోవడం, పరిశోధన, ఆవిష్కరణలకు అపార అవకాశాలు ఉన్నాయి. జ్ఞాన వనరులు, యువ జనాభా, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మన బలమని పేర్కొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమం, అలాగే జాతీయ విద్యా విధానం 2020 (ఎన్ఈపీ-2020) ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, సంస్థలకు అంతర్జాతీయ మార్గాలు విస్తరిస్తున్నాయని తెలిపారు.

ఏఐ నుంచి సెమీకండక్టర్ల వరకు భారత్ ఎదుగుతోంది

కృత్రిమ మేధస్సు (ఏఐ), బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, సుస్థిర ఇంధన రంగాల్లో భారత్ విశ్వసనీయ ఆవిష్కరణ భాగస్వామిగా అవతరిస్తోందని ప్రధాన్ చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాలకు సహకారం, సామర్థ్య నిర్మాణం, జ్ఞాన భాగస్వామ్యంపై ఆధారపడిన మోడల్‌ను భారత్ ముందుకు తీసుకెళ్తోందని వివరించారు.

విదేశీ విశ్వవిద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్

ఉన్నత విద్యా కార్యదర్శి వినీత్ జోషి మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాల్లో ఎన్ఈపీ-2020 వల్ల ఉన్నత విద్యా సంస్కరణలకు స్పష్టమైన దిశ ఏర్పడిందన్నారు. బహుళ శాఖ విద్య, నైపుణ్యాల సమన్వయం, అంతర్జాతీయీకరణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. యూజీసీ పారదర్శక, కాలపరిమితి విధానంతో విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లు స్థాపించేందుకు అనుమతులు ఇస్తోందన్నారు. ఆస్ట్రేలియా, ఇటలీ, యుకే, అమెరికా వంటి దేశాల ప్రముఖ సంస్థల దరఖాస్తులు ఒక నెలలోపే ఆమోదం పొందినట్లు వెల్లడించారు.

విద్యా దౌత్యానికి బలం

‘స్టడీ ఇన్ ఇండియా ఎడ్యూ-డిప్లొమాటిక్ కాన్‌క్లేవ్’ ద్వారా భాగస్వామ్య దేశాల విద్యార్థులను భారత్‌లో ఉన్నత, స్వల్పకాలిక కోర్సులకు ఆహ్వానించడం, సంస్థల మధ్య భాగస్వామ్యాలు పెంపొందించడం, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను భారత్‌లో క్యాంపస్‌లు ప్రారంభించేందుకు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌తో చేతులు కలపాలి: ధర్మేంద్ర ప్రధాన్ - Tholi Paluku