Let's talk: editor@tmv.in
విదేశీ విద్యానిధి బకాయిలను వెంటనే విడుదల చేయాలి: కేటీఆర్

విదేశీ విద్యానిధి బకాయిలను వెంటనే విడుదల చేయాలి: కేటీఆర్

Gaddamidi Naveen
25 మార్చి, 2026

విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం శాసనసభలో గళమెత్తారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన “ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఫండ్” ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ పథకం కింద సుమారు 7,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించబడిందని తెలిపారు.

అయితే 2025 అక్టోబర్‌లో ప్రభుత్వం రూ.303 కోట్ల నిధులను విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఆ నిధులు పంపిణీ కాలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం దాదాపు 2,500 మంది విద్యార్థులు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా, లండన్, జర్మనీ వంటి దేశాల్లో చదువుతున్న విద్యార్థులు మొదటి సెమిస్టర్ ఫీజులు కట్టినప్పటికీ, రెండో సెమిస్టర్‌కు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ సభ దృష్టికి తెచ్చారు. మేము బీఆర్ఎస్ హయాంలో ఈ పథకం కింద విదేశాలకు వచ్చాము, కానీ ఇప్పుడు నిధులు అందక ఇబ్బంది పడుతున్నాము. మా తరపున అసెంబ్లీలో మాట్లాడండి అని విద్యార్థులు తనను కోరినట్లు ఆయన తెలిపారు.

విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా, పెండింగ్‌లో ఉన్న నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మౌలానా అబుల్ కలాం తాలీమ్-ఇ-తహ్ఫా పథకం ఇంకా అమలుకు నోచుకోలేదని ఆయన గుర్తుచేశారు.

దివ్యాంగుల నిరసన దీక్షకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు

కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను వంచించిందని ఆరోపిస్తూ, నేడు ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగులు చేపట్టనున్న నిరసన దీక్షకు కేటీఆర్ పూర్తి మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ వెలుపల దివ్యాంగుల ప్రతినిధులు కేటీఆర్‌ను కలిసి, తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

ఎన్నికల ముందు దివ్యాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నెలవారీ పెన్షన్లు కూడా సమయానికి అందక దివ్యాంగులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేశామని, కాంగ్రెస్ హయాంలో ఆ సంక్షేమం గంగలో కలిసిపోయిందని విమర్శించారు. దివ్యాంగుల పక్షాన బీఆర్ఎస్ శాసనసభలో పోరాడుతుందని, ప్రభుత్వం తన అసమర్థతను వీడి తక్షణమే హామీలను నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.