
విదేశీ రుణాల కోసం ‘పాక్ ‘ లాడుతున్నాం: ప్రధాని షరీఫ్
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తన దేశ ఆర్థిక పరిస్థితిపై అత్యంత నిజాయితీతో కూడిన, బాధాకరమైన వ్యాఖ్యలు చేశారు. విదేశీ రుణాల కోసం ఇతర దేశాలను అర్థించడం వల్ల పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో తన "తల వంచుకోవాల్సి" వస్తోందని ఆయన అంగీకరించారు. ఆర్థిక సహాయం కోసం స్నేహపూర్వక దేశాల వద్దకు వెళ్లడం ఒక అవమానకరమైన ప్రక్రియ అని, ఇది దేశం యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆయన వ్యాపారవేత్తల సమావేశంలో వాపోయారు. అప్పుల కోసం అడగడం కేవలం ఆర్థిక అవసరమే కాకుండా, దేశ ప్రతిష్టను తగ్గించే చర్యగా ఆయన అభివర్ణించారు.
దివాలా అంచున ఆర్థిక వ్యవస్థ
గత కొన్ని ఏళ్లుగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం తీవ్రతను ప్రధాని గుర్తు చేసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన సమయంలో దేశం సాంకేతికంగా దివాలా తీయడానికి అత్యంత సమీపంలో ఉందని ఆయన వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా మారిందని, దీనివల్ల సామాన్య ప్రజలు నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. 2023లో పారిస్‌లో ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌తో జరిగిన కీలక సమావేశం తర్వాతే కొంత ఉపశమనం లభించిందని, తద్వారా ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు పడ్డాయని ఆయన వివరించారు.
అప్పులతో వచ్చే అణచివేత షరతులు
విదేశీ రుణాలు కేవలం నగదు రూపంలోనే కాకుండా, భారమైన షరతులతో వస్తాయని షరీఫ్ స్పష్టం చేశారు. "మనం రుణాలు కోరినప్పుడు, రుణదాతల నుండి వచ్చే అనుచితమైన డిమాండ్లను కూడా అమలు చేయాల్సి వస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. కొన్నిసార్లు ఎటువంటి సహేతుకమైన కారణం లేకపోయినా, రుణదాతలు పెట్టే నిబంధనలకు తలొగ్గడం దేశ సార్వభౌమత్వానికి, ఆత్మగౌరవానికి విఘాతం కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశ విధాన నిర్ణయాలలో విదేశీ జోక్యాన్ని పెంచుతుందనే సంకేతాలను ఆయన ఇచ్చారు.
సైనిక నాయకత్వంతో కలిసి రుణాల వేట
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించడానికి పౌర ప్రభుత్వం మాత్రమే కాకుండా, సైనిక నాయకత్వం కూడా రంగంలోకి దిగాల్సి వచ్చిందని ప్రధాని వెల్లడించారు. ఆర్మీ చీఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో కలిసి తాను వ్యక్తిగతంగా పలు దేశాల నాయకులను కలిసి బిలియన్ల డాలర్ల రుణాల కోసం విన్నవించినట్లు ఆయన తెలిపారు. చైనా, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాలు పాకిస్తాన్‌కు అండగా నిలిచాయని, అయితే ప్రతిసారీ ఇలా ఇతరులపై ఆధారపడటం గౌరవప్రదం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
పరిశ్రమలకు ప్రకటించిన భారీ రాయితీలు
దేశాన్ని ఈ రుణ ఊబి నుండి బయటపడేయాలంటే ఎగుమతులను పెంచడమే ఏకైక మార్గమని గుర్తించిన ప్రధాని, పరిశ్రమలకు కీలక రాయితీలను ప్రకటించారు. ఇందులో భాగంగా విద్యుత్ సుంకాలను యూనిట్‌కు PKR 4.04 తగ్గించారు. అలాగే, పారిశ్రామిక ఎగుమతులను ప్రోత్సహించడానికి వీలింగ్ ఛార్జీలను PKR 9 కి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యల ద్వారా వ్యాపార వర్గాలకు ఊతం లభిస్తుందని, దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఎగుమతుల వృద్ధి ద్వారా స్వయం సమృద్ధి లక్ష్యం
ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు కీలక పాత్ర పోషించాలని షరీఫ్ పిలుపునిచ్చారు. ఎగుమతి రీఫైనాన్స్ స్కీమ్ రేటును 7.5% నుండి 4.5% కి తగ్గిస్తూ తక్షణ ఉపశమనం కల్పించారు. పాకిస్తాన్ ఇకపై రుణాల కోసం ఇతర దేశాల ముందు చేయి చాచే పరిస్థితి నుండి బయటపడాలని, కేవలం పారిశ్రామికాభివృద్ధి బలమైన ఎగుమతుల ద్వారానే దేశం కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి పొందగలదని ఆయన ఉద్ఘాటించారు.
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభ కారణాలు, ఐఎమ్ఎఫ్ విధిస్తున్న షరతులు
ప్రస్తుత పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి దశాబ్దాలుగా సాగుతున్న భారీ విదేశీ అప్పులు, రాజకీయ అస్థిరత, రక్షణ రంగంపై చేస్తున్న అధిక వ్యయం ప్రధాన కారణాలు. ముఖ్యంగా చైనా వంటి దేశాల నుండి తీసుకున్న అధిక వడ్డీ రుణాల చెల్లింపులు భారంగా మారడం, సరిహద్దు వివాదాల వల్ల రక్షణ బడ్జెట్ పెరగడం, 2022 నాటి భారీ వరదలు దేశ ఆర్థిక వెన్నెముకను దెబ్బతీశాయి. దీనికి తోడు అవినీతి, సరైన పారిశ్రామిక విధానాలు లేకపోవడంతో ఎగుమతులు తగ్గి, విదేశీ మారక నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోయి దేశం దివాలా అంచునకు చేరుకుంది.
ఈ గడ్డు పరిస్థితి నుండి బయటపడటానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి దాదాపు 7 బిలియన్ డాలర్ల ప్యాకేజీని మంజూరు చేస్తూ దాదాపు 64 అత్యంత కఠినమైన షరతులను విధించింది. వీటిలో భాగంగా విద్యుత్, గ్యాస్ సబ్సిడీలను పూర్తిగా తొలగించి ధరలను పెంచడం, వ్యవసాయ, రిటైల్ రంగాలపై కొత్త పన్నులు విధించడం, ప్రభుత్వ అధికారుల ఆస్తులను బహిరంగపరచడం, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం, విదేశీ మారక విధానంలో కరెన్సీ విలువను మార్కెట్ ఆధారితంగా ఉంచాలి, ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు , వంటి నిబంధనలు ఉన్నాయి. ఈ షరతుల వల్ల సామాన్య ప్రజలపై ద్రవ్యోల్బణ భారం విపరీతంగా పెరిగినప్పటికీ, దేశాన్ని పూర్తిస్థాయి దివాలా నుండి రక్షించడానికి ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయాలను అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
