Let's talk: editor@tmv.in
విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో రూ. 3 లక్షలు టోకరా

విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో రూ. 3 లక్షలు టోకరా

Panthagani Anusha
27 అక్టోబర్, 2025

తక్కువ ధరకు యూఎస్ డాలర్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి ముంబైకి చెందిన ఒక వ్యక్తిని ముగ్గురు కేటుగాళ్లు దారుణంగా మోసంచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ మోసంలో బాధితుడు రూ. 3 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటనపై నవీ ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం, ముంబైలోని కాందీవలి ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని ఈ ముగ్గురు మోసగాళ్లు అక్టోబర్ 18 నుంచి 20 తేదీల మధ్య వివిధ ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించారు. డిస్కౌంటెడ్ రేట్‌లో అమెరికన్ డాలర్లు విక్రయిస్తామని నమ్మించారు. వారి మాటలను నమ్మిన బాధితుడు నవీ ముంబైలోని ఘన్సోలి ప్రాంతంలో మోసగాళ్లను కలిసి . అక్కడ వారికి రూ. 3 లక్షల నగదును చెల్లించాడు. అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మోసగాళ్లు బాధితుడికి చెందవలసిన యూఎస్ డాలర్లు తరవాత ఫోన్ ద్వారా పంపుతామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇకపోతే ప్రైవేట్ సోర్సెస్ లేదా అనుమతి లేని మార్గాల ద్వారా విదేశీ కరెన్సీ కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం.సులభమైన మార్గంలో తక్కువ ఖర్చుతో అయిపోతుంది అని తొందరపడీతే ఇలాంటి ప్రయత్నాలు మోసపోసే ప్రమాదాన్ని పెంచుతాయి.

మరోవైపు ఈ సంఘటన జరిగి కొన్ని రోజులైనా వారినుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో బాధితుడు మళ్లీ వారిని సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయితే, నిందితుల ఫోన్‌లు స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు ఆధారంగా నవీ ముంబైలోని రబాలే పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 23న ముగ్గురు మోసగాళ్లపై కేసు నమోదు చేసి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 420 (మోసం) 34 (ఉమ్మడి ఉద్దేశం) కింద దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కేసు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు, నేరస్తుల పేర్లు కానీ ఇంకా తెలియరాలేదు. కానీ త్వరలోనే వారి పట్టుకొనే ప్రయత్నాలు జారుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

విదేశీ కరెన్సీ మార్పిడి పేరుతో రూ. 3 లక్షలు టోకరా - Tholi Paluku