
విదేశీయులకు అమెరికా షాక్.. వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ పొడిగింపు రద్దు
వలసదారులపై కఠిన విధానాలను అమలు చేస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీయుల పని అనుమతులను ఆటోమేటిక్‌గా పునరుద్ధరించే విధానానికి ముగింపు పలికింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) అధికారికంగా ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది విదేశీయులు, ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త నిబంధన ఏంటి?
హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకారం, అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్‌ల (ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్-ఈఏడీ) పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ సదుపాయం ఉండదు. ఈ తేదీ కంటే ముందు పని అనుమతులను పొడిగించుకున్న వారిపై కొత్త నిబంధనల ప్రభావం ఉండదని డీహెచ్‌ఎస్ పేర్కొంది. ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు ట్రంప్ సర్కార్ తెలిపింది.
గతంలో జో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఈఏడీ పునరుద్ధరణ దరఖాస్తులు ప్రాసెసింగ్ ఆలస్యమైనా, వలసదారులు తమ వర్క్ పర్మిట్ కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుండేది. అయితే ఈ విధానానికి ముగింపు పలుకుతూ తాజాగా ట్రంప్ ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో ఈఏడీ గడువు ముగిసిన తర్వాత కొత్త కార్డు వచ్చే వరకు ఉద్యోగులు పనిచేయకుండా ఉండాల్సి వస్తుంది.
వలసదారులకు **యూఎస్‌సీఐఎస్** సూచన*
ఈ నష్టం నుంచి తప్పించుకోవడానికి పని అనుమతుల పొడిగింపు కోసం ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అగ్రరాజ్య అధికారులు స్పష్టం చేశారు. యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ, ‘‘వలసదారులకు అమెరికాలో ఉద్యోగం అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే, వారి హక్కు కాదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఈఏడీ రెన్యువల్ కోసం వలసదారులు ఎంత ఆలస్యం చేస్తే వారికి అంత నష్టం. ఒక్కోసారి తాత్కాలికంగా పని అనుమతులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే వర్క్ పర్మిట్ల గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తులు సమర్పిస్తే మంచిది’’ అని యూఎస్‌సీఐఎస్ సూచించింది. ఈ కొత్త నిబంధన లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, హెచ్-4 వీసా హోల్డర్ల కుటుంబాల ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.
ఏమిటీ ఈఏడీ?
ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ), దీనిని ఫారం ఐ-766 అని కూడా అంటారు. ఇది అమెరికాలో తాత్కాలికంగా నివసిస్తున్న విదేశీయులకు అక్కడ చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతి ఇచ్చే ఒక పత్రం. ఇది ఒక రకమైన వర్క్ పర్మిట్ కార్డు.
వీరికి అవసరం లేదు: అమెరికన్ చట్టాల ప్రకారం గ్రీన్‌కార్డుతో శాశ్వత నివాసం పొందిన వారు, ప్రత్యేక నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లు (హెచ్-1బీ, ఎల్-1బీ,ఓ,పీ) ఈఏడీ పత్రాల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
వీరికి అవసరం: గ్రీన్‌కార్డు పెండింగ్‌లో ఉన్నవారు, డిపెండెంట్ వీసాలపై (ఉదాహరణకు హెచ్-4, ఎల్-2 వీసా) అమెరికా వచ్చిన వ్యక్తి జీవిత భాగస్వాములు, పిల్లలు (వారు ఉద్యోగం చేయాలనుకుంటే), ఎఫ్-1 (అకాడమిక్), ఎం-1 (వొకేషనల్) వంటి విద్యార్థి వీసాలపై వచ్చి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) లేదా ఇతర నియమాల కింద ఉద్యోగం చేయాలనుకునేవారు, అమెరికాలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈఏడీ తప్పనిసరిగా తీసుకోవాలి.
భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుంది?
అమెరికా ప్రభుత్వం ఈఏడీ ఆటోమేటిక్ పొడిగింపును రద్దు చేయడం వల్ల భారతీయులపై ప్రత్యక్షంగా, గణనీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
పని అనుమతిలో ఆలస్యం: ఇంతకుముందు ఈఏడీ రీన్యువల్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత 540 రోజుల ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ లభించేది. ఇప్పుడు అది లేకపోవడంతో, యూఎస్ సీఐఎస్ ప్రాసెస్ పూర్తి అయ్యే వరకు ఉద్యోగం ఆగిపోవచ్చు.
ఉద్యోగం కోల్పోయే ప్రమాదం: ఈఏడీ రెన్యూవల్ ఆలస్యం అయితే, ఆ వ్యక్తి చట్టబద్ధంగా పని చేయలేడు. దీనివల్ల అనేక మంది భారతీయులు ముఖ్యంగా హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు (హెచ్-4) తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఆర్థిక భారం: ఈఏడీ ఆలస్యాల వల్ల కుటుంబాలకు ఆదాయం ఆగిపోవడం, కొత్తగా దరఖాస్తులు వేయడం వల్ల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
తరచూ పరిశీలనలు: ప్రతిసారి కొత్తగా ఈఏడీ పొడిగింపు కోసం మరింత కఠినమైన తనిఖీలు జరగడం వల్ల ప్రాసెస్ క్లిష్టంగా మారుతుంది.
ఐటీ, టెక్ రంగంపై ప్రభావం: అమెరికాలోని టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న అనేక మంది భారతీయులు/వారి జీవిత భాగస్వాములు హెచ్-4 వీసాల కింద ఉన్నారు. వీరి ఉద్యోగ స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉంది.
మొత్తంగా ఈ నిర్ణయం వల్ల భారతీయ వలసదారులు, ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్, ఈ- వీసా కుటుంబాలు ఉద్యోగ భద్రత, ఆర్థిక స్థితి, ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ విషయంలో కొత్త సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.
