
విదేశాంగ విధానం వల్లే దేశ ఇంధన భద్రత దెబ్బతింది: రాహుల్ గాంధీ
దేశ ఇంధన భద్రతను తప్పుడు విదేశాంగ విధానం దెబ్బతీసిందని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. భవిష్యత్తులో పెద్ద సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం ముందుగానే సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్యాస్, ఇంధన సరఫరా భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ పరిణామాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం తన ఇంధన భద్రతను స్వయంగా నిర్వహించేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తప్పుడు విదేశాంగ విధానాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తూ, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. లేకపోతే కోట్లాది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ప్రస్తుత ప్రపంచ వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. అలాంటి అస్థిర పరిస్థితుల్లో పాత విధానాలతో కొనసాగడం సరిపోదని, కొత్త దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
రాజకీయ వ్యాఖ్యలు కావు.. ముందస్తు హెచ్చరిక మాత్రమే
ఈ విషయంపై తాను రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదని, ముందస్తు హెచ్చరికగా మాత్రమే చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశ ప్రజల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంధన భద్రతకు సంబంధించిన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం తన సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. ఇక ఎల్పీజీ పరిస్థితిపై పార్లమెంటులో మాట్లాడాలని తాను కోరుకున్నానని, కానీ ముందుగా మంత్రి మాట్లాడిన తర్వాత తాను మాట్లాడాల్సిన కొత్త విధానం అమలులోకి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడుతున్నదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. దేశీయ వినియోగదారులకు సరిపడా గృహ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అయితే వాణిజ్య ఎల్పీజీపై ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి ఆహార వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇండక్షన్ స్టవ్‌లు, మైక్రోవేవ్‌లు, కట్టెలు లేదా సౌరశక్తి ఆధారిత పద్ధతులను ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రజలకు ఆందోళన వద్దంటూనే మోడీ భయపడుతున్నారు
ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఆందోళన చెందొద్దని చెబుతున్నప్పటికీ, తానే ఇతర కారణాలతో భయపడుతున్నారని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఎఫ్‌స్టీన్ ఫైళ్ల విషయం, అమెరికాలోని ఆదానీ కేసు కారణంగా ప్రధాని ఆందోళనలో ఉన్నారని ఆరోపించారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ సముదాయంలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ప్రియాంకగాంధీ వాద్రాతో పాటు పలు ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. నిరసనలో భాగంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లోని మకర్‌ద్వార్ సమీపంలో నినాదాలు చేశారు. మహిళా ప్రతిపక్ష ఎంపీలు ప్రతీకాత్మకంగా ఇటుకలతో చేసిన వంట చుల్లా వద్ద కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సంక్షోభ సమయంలోనూ ప్రచారంలో ప్రధాని
ఇదిలా ఉండగా మల్లికార్జున్ ఖర్గే కూడా సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధాని ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత కారణంగా ప్రజలు క్యూల్లో నిలబడాల్సి వస్తోందని, చిన్నా–పెద్ద పరిశ్రమలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యానికి ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ఆయన విమర్శించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై పూర్తి స్థాయి చర్చ జరపాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేస్తున్నాయి. అయితే సభ ప్రారంభమైన కొద్దిసేపటికే నినాదాల మధ్య వాయిదా పడింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సస్పెండ్ అయిన ప్రతిపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంట్ మెట్లపై కూర్చొని టీ తాగారు.
