
విదేశాంగ విధానం ప్రభుత్వాలకు కాదు ప్రజలకు నమ్మకం కలిగించాలి
‘‘అన్నింటినీ మార్చగలం కానీ మన పొరుగువారిని మార్చలేం’’ భారత్ చుట్టుపక్కలదేశాల గురించి మాట్లాడుతూ దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యలివి. భారత విదేశాంగ విధానం ఈ భౌగోళికత వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని సాగాలని అంతర్జాతీయ నిపుణులు చెబుతుంటారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచి పాకిస్తాన్, చైనా మినహా పొరుగుదేశాలతో మంచి సంబంధాలే ఉన్నాయి. శ్రీలంక, నేపాల్, భూటాన్, మియన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవులు వంటి దేశాల విషయంలో దక్షిణాసియా పెద్దన్న తరహాలోనూ వ్యహరిస్తుంటుంది. భారత్‌కు ప్రధానంగా పాకిస్తాన్, చైనా దేశాలతోనే శత్రుత్వం ఉండేది. సోవియట్ యూనియన్ మిత్రదేశం కావడంతో భారత్ విషయంలో అమెరికా కాస్త దూరం పాటించేది. మొత్తంగా చుట్టూ ఉన్న చిన్న దేశాలతో భారత్ సఖ్యంగా మెలిగేది. వాటికి సహాయ సహకారాలు అందించేది. అయితే కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మన విదేశాంగ విధానంలో బాగా మార్పులొచ్చాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత భారత్ నెమ్మదిగా అమెరికాతోనూ సత్సంబంధాలు ఏర్పరుచుకుంది. అదే సమయంలో చైనా ప్రాబల్యమూ పెరుగుతూ వచ్చింది. నరేంద్రమోదీ ప్రధాని కాకముందే భారత్‌కు అమెరికాతో మంచి సంబంధాలున్నాయి. ఆ తర్వాత ఇవి మరింత పెరిగాయి. ఈ పదకొండేళ్ల కాలంలో అమెరికాతో పాటు యూరప్ దేశాలకూ భారత్ బాగా దగ్గరయింది. ఈ క్రమంలోనే పొరుగుదేశాలకు భారత్ దూరం జరిగిందని, చుట్టుపక్కల ఉన్నదేశాల రాజకీయాలు, ఇతర వ్యవహారాలపై తొలి నుంచీ ఉన్న పట్టు సడలిపోయిందని ఓ వాదన వినిపిస్తోంది. అదే సమయంలో భారత్ ప్రభావిత దేశాల్లో చైనా ఆధిపత్యం పెరిగిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సంగతి పక్కన పెడితే భారత్ పెద్ద పీట వేసిన దేశాలతో కూడా ఇప్పుడు అంత సానుకూల సంబంధాలున్నట్టు కనిపించడంలేదు. అమెరికాతో భారత్ స్నేహంలో ఎంత డొల్లతనం ఉందో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తెలిసి వచ్చింది. ప్రస్తుతం బాగానే ఉన్నప్పటికీ ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్ వంటి యూరప్ దేశాలు భారత్‌తో స్నేహాన్ని ఏ రూపంలో కొనసాగిస్తాయన్నది చూడాల్సి ఉంది.
నిజానికి మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాంగవిధానంలో నైబర్‌హుడ్ ఫస్ట్ అనే మాటను చేర్చారు. తొలిసారి ప్రమాణస్వీకారం చేసేటప్పుడు మోదీ పొరుగు దేశాల అధినేతలను భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించి ఆశ్చర్యపరిచారు. అకస్మాత్తుగా పాకిస్తాన్ వెళ్లి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిసి యావత్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు మోదీ. నైబర్ హుడ్ ఫస్ట్ విధానంలో భాగంగా పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలతో సంబంధాలకు, ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ వాస్తవంలో పాశ్చాత్యదేశాలకు భారత్ దగ్గర జరిగిందని, అదే సమయంలో మన పొరుగుదేశాలు చైనాకు ప్రాధాన్యత ఇవ్వడం పెరిగిందన్నది ఆరోపణ. నేపాల్ రాజకీయాలు దిల్లీ కనుసన్నల్లో సాగుతాయని ఓ ప్రచారం ఉంది. కానీ కొన్నేళ్లగా నేపాల్ చైనాకు దగ్గరవుతూ వచ్చింది. సాంస్కృతికంగా భారత్‌తో దగ్గరి సంబంధం ఉన్నప్పటికీ చైనా ప్రభావాన్ని పెంచుకుంటోంది నేపాల్. బెల్ట్ అండ్ ఇనీషియేటివ్ ప్రాజెక్టు పేరుతో అనేక దేశాలను చైనా చెప్పుచేతల్లోకి తీసుకుంటోంది. శ్రీలంక దివాళాకు దారితీసిన కారణాల్లో చైనా నుంచి తీసుకున్న అప్పులు కూడా ఓ కారణమని భావిస్తారు. కష్టకాలంలో శ్రీలంకను భారత్ అన్ని విధాలా ఆదుకుంది. కానీ శ్రీలంక మాత్రం భారత్ నుంచి ఎంత సాయం పొందినా చైనాకు పెద్దపీట వేయడం ఆగలేదు. చైనాతోనే ఎక్కువ స్నేహసంబంధాలు కొనసాగిస్తోంది. నేపాల్ రాజకీయాల్లో భారత్ కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ ఈ 11ఏళ్ల కాలంలో నేపాల్‌లో చైనా ప్రభావం బాగా పెరిగింది. రాజకీయ అస్థిరత తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ నేపాల్‌పై చైనా పట్టుబిగుస్తోంది. బంగ్లాదేశ్‌లో భారత్ అనుకూల ప్రభుత్వానికి నేతృత్వం వహించిన షేక్ హసీనా తర్వాత దేశం వదలాల్సి వచ్చింది. ఆమె ప్రస్తుతం భారత్‌లోనే తలదాచుకుంటున్నారు. మాల్దీవులు భారత్‌కు వ్యతిరేకంగా పరోక్షంగా యుద్ధంలాంటిదే చేసింది. ఆ దేశమూ చైనాకు దగ్గరయింది. మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వమూ చైనాతో అంటకాగుతోందన్న ఆరోపణలున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడంలో చైనా, రష్యా కీలకపాత్ర పోషించాయి. అప్ఘాన్ పరిణామాలను భారత్ వ్యతిరేకంచలేదు. సమర్థించలేదు. భారత్‌పై అన్ని విధాలా ఆధారపడిన భూటాన్ సైతం చైనాతో సరిహద్దు చర్చలు జరిపింది. ఇలా మన పొరుగుదేశాలన్నీ మనకు దూరం జరిగినట్టుగా కనిపిస్తోంది. గత ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన ఆందోళనలు, గత నెలలో నేపాల్‌లో జరిగిన నిరసనల్లోనూ భారత వ్యతిరేకత కనిపించిందని అంతర్జాతీయ పరిశీలకులు అంటున్నారు. లౌకికవాద దేశంగా ఉన్న గుర్తింపు పొరుగుదేశాలతో భారత్ సంబంధాలను మెరుగుపరిచిందని, అనేక దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అవకాశాన్ని కల్పించిందని, ఈ పదకొండేళ్ల కాలంలో అన్ని విషయాల్లోలానే విదేశాంగవిధానాన్ని హిందుత్వం ప్రభావితం చేసిందని, భిన్నమతాలుండే పొరుగుదేశాలు భారత్‌పై నమ్మకం కోల్పోడానికి ఇదో కారణమన్న వాదనుంది. ఈ వాదన సంగతి పక్కన పెడితే భారత విదేశాంగ విధానం ఓ సంక్లిష్టత ఎదుర్కొంటున్న విషయం మాత్రం స్పష్టం. అంతర్జాతీయంగా మన మిత్రదేశం ఏదని అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేని పరిస్థితి. రష్యా భారత్‌కు నమ్మదగ్గ మిత్రదేశమయినప్పటికీ చైనా, భారత్‌లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే పుతిన్ చైనా వైపే మొగ్గుచూపుతారన్నది అంగీకరించి తీరాల్సిన వాస్తవం. ఆ చైనా పాకిస్తాన్‌కు అనుంగు మిత్రదేశం. మన విదేశాంగ విధానంలో లోపం కావొచ్చు, ట్రంప్ అహంకారం కావొచ్చు..చివరకు సరిహద్దు విభేదాలు పక్కనపెట్టి మరీ చైనాతో సఖ్యంగా ఉండితీరాల్సిన పరిస్థితులూ ఏర్పడ్డాయి. ఇదంతా గమనిస్తే భారత్ తెలియని ఓ విషవలయంలో చిక్కుకున్నట్టుగా కనిపిస్తుంది. దీన్నుంచి బయటపడడానికి ముందుగా పొరుగుదేశాలతో మంచి స్నేహసంబంధాలు కొనసాగించాలి. దీనికి మార్గం ఆయాదేశాల ప్రభుత్వాలతో కాకుండా ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరుచుకోవడం, వారికి నమ్మకం కలిగించేలా వ్యవహరించడం. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మియన్మార్, భూటాన్, మాల్దీవుల దేశాల ప్రభుత్వాలతో కాకుండా అక్కడి ప్రజలతో భారత్ సఖ్యంగా మెలగాలి. ఏ దేశంలో అయినా అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటాయి. చేసిన సాయం మరిచిపోయి తాత్కాలిక ప్రయోజనాలను లెక్కకడతాయి. భారత్ విషయంలో పొరుగుదేశాలు ఇలాగే ప్రవర్తిస్తున్నాయని భావిస్తున్నారు. అందుకే భారత్ పొరుగుదేశాల ప్రభుత్వాలతో కాకుండా ప్రజలతో సంబంధబాంధవ్యాలు కొనసాగించాలి.
