
విడాకులు తీసుకున్న టీమిండియా క్రికెటర్ రాహుల్ చాహర్
భారత క్రికెటర్, స్పిన్నర్ రాహుల్ చాహర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. తన సతీమణి ఇషానితో విడిపోతున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. 2022లో వివాహం చేసుకున్న ఈ జంట, సుదీర్ఘ న్యాయపరమైన ప్రక్రియ అనంతరం అధికారికంగా విడిపోయారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాహుల్ చాహర్ ఒక సుదీర్ఘమైన, భావోద్వేగపూరితమైన సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు.
న్యాయపోరాటం తర్వాతే ముగింపు
గత పదిహేను నెలలుగా తాను కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని రాహుల్ పేర్కొన్నారు. "చిన్న వయస్సులోనే నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. అప్పట్లో నాకు నా విలువ గురించి, నేను కోరుకునే జీవితం గురించి పూర్తి అవగాహన లేదు. కానీ గడచిన 15 నెలలు నాకు ఓపిక, పట్టుదల, నిజాయితీగా ఉండటం వంటి విషయాలను నేర్పించాయి" అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత ఈ వివాహ బంధం అధికారికంగా ముగిసిందని, ఈ నిర్ణయం కోసం తాను భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.
జీవితంలో కొత్త అధ్యాయం..
కొన్ని బంధాలు జీవితాంతం కలిసి ఉండటానికి కాదని, అవి మనల్ని మేల్కొలిపేందుకు, పాఠాలు నేర్పేందుకు మాత్రమే వస్తాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ విడిపోవడాన్ని ఒక ముగింపుగా కాకుండా, ఒక 'రీసెట్'గా భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. "నా జీవితంలో ఈ అధ్యాయాన్ని ఎటువంటి కోపం, పశ్చాత్తాపం లేకుండా ముగిస్తున్నాను. ఇకపై నేను తీసుకునే నిర్ణయాలు ఆత్మగౌరవం, ప్రశాంతతకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాయి. పాత జ్ఞాపకాలలోని చేదును వదిలేసి, గౌరవంగా కొత్త జీవితాన్ని ప్రారంభించే ధైర్యంతో ముందుకు సాగుతున్నాను" అని రాహుల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
రాహుల్ చాహర్ క్రికెట్ ప్రస్థానం
26 ఏళ్ల రాహుల్ చాహర్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఇప్పటివరకు ఒక వన్డేలో ఒక వికెట్, ఆరు టీ20లలో 23.85 సగటుతో ఏడు వికెట్లు పడగొట్టారు. 2021 టీ20 ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్, ఇప్పటివరకు ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడి 75 వికెట్లు తీశారు. ఈ సీజన్ నుంచి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున రాహుల్ బరిలోకి దిగనున్నారు.
