Let's talk: editor@tmv.in
విజయ మెడికల్ సెంటర్ జిల్లాస్థాయి సేవలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

విజయ మెడికల్ సెంటర్ జిల్లాస్థాయి సేవలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

Gaddamidi Naveen
23 డిసెంబర్, 2025

తెలంగాణ వ్యాప్తంగా నాణ్యమైన, వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందులో భాగంగా, సోమవారం విజయ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి డయాగ్నోస్టిక్ సేవలను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి మౌలిక అంశాల పరిష్కారమే తమ ప్రభుత్వ అసలైన ఎజెండా అని పేర్క‌న్నారు. ఆధునిక వైద్య విధానంలో వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం అత్యంత కీలకమని, అందుకు విశ్వసనీయమైన డయాగ్నోస్టిక్ సేవలు వెన్నెముక వంటివని ఆయన అభివర్ణించారు. ఆధునిక వైద్యం అనేది ప్రధానంగా వ్యాధి నిర్ధారణపై ఆధారపడి ఉంటుందని, సరైన సమయంలో ఖచ్చితమైన పరీక్షలు జరిగితేనే సమర్థవంతమైన చికిత్స సాధ్యమవుతుందన్నారు. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన పరీక్షా సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయ‌న పేర్కొన్నారు.

రెండవ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుందని ఆయ‌న‌ వెల్లడించారు. పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, మారుమూల ప్రాంతాల ప్రజలు కూడా నాణ్యమైన డయాగ్నోస్టిక్ పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయ‌న‌ తెలిపారు.

విజయ మెడికల్ సెంటర్ ద్వారా జిల్లాస్థాయిలో డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్య వ్యవస్థలపై ఉండే భారం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా ఒక కీలక ముందడుగుగా నిలుస్తుందని ఆయ‌న‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ అలాగే విజయ మెడికల్ సెంటర్ బృందానికి అభినందనలు తెలిపారు. ఖచ్చితత్వం, నిష్పక్షపాతత, మానవతా విలువలతో తెలంగాణ ప్రజలకు సేవలందిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచాలని ఆయ‌న‌ ఆకాంక్షించారు.