Let's talk: editor@tmv.in
విజయ్ హజారే ట్రోఫీలో సెమీఫైనల్స్‌కు విదర్భ, పంజాబ్

విజయ్ హజారే ట్రోఫీలో సెమీఫైనల్స్‌కు విదర్భ, పంజాబ్

Pinjari Chand
14 జనవరి, 2026

గత సీజన్ రన్నరప్ విదర్భ, బలమైన జట్టు పంజాబ్ ఈ ఏడాది జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మంగళవారం బెంగళూరులో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో విదర్భ ఢిల్లీపై 76 పరుగుల తేడాతో గెలవగా, పంజాబ్ మధ్యప్రదేశ్‌ను 183 పరుగుల భారీ తేడాతో ఓడించింది.

విదర్భ వర్సెస్ ఢిల్లీ

ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అమన్ మోఖడే 12 బంతుల్లో 31 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం అథర్వ తైదే (72 బంతుల్లో 62 పరుగులు), ధృవ్ షోరీ (71 బంతుల్లో 49 పరుగులు) కలిసి రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాంత్ శర్మ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 33.5 ఓవర్లకు విదర్భ 173/4కి చేరగా, ఐదో వికెట్‌కు యశ్ రాథోడ్ (73 బంతుల్లో 86 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును 300 పరుగుల మార్క్ దాటించాడు. నిర్ణీత 50 ఓవర్లలో విదర్భ 300/9 స్కోరు చేసింది.

ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ (2/47), నవదీప్ సైనీ (2/68), ప్రిన్స్ యాదవ్ (2/59), నితీశ్ రాణా (2/19) వికెట్లు తీశారు.

301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 80/4కే కుప్పకూలింది. విదర్భ బౌలర్లు నచికేత్ భూటే (4/51), హర్ష్ దూబే (3/36) చెలరేగారు. చివర్లో అనుజ్ రావత్ (98 బంతుల్లో 66), హర్ష్ త్యాగి (27) ఏడో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ఇచ్చినా, ఢిల్లీ 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది.

పంజాబ్ వర్సెస్ మధ్యప్రదేశ్

మరో క్వార్టర్ ఫైనల్లో పంజాబ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 50 ఓవర్లలో 345/6 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్ (71 బంతుల్లో 51), కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (86 బంతుల్లో 88) కలిసి 116 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం అన్మోల్‌ప్రీత్ సింగ్ (62 బంతుల్లో 70) కీలకంగా రాణించాడు. చివర్లో నేహల్ వధేరా (38 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రమందీప్ సింగ్ (24), సన్వీర్ సింగ్ (13) జట్టును భారీ స్కోరుకు చేర్చారు.

347 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మన్‌లు పూర్తిగా విఫలమయ్యారు. సన్వీర్ సింగ్ (3/31) అద్భుతంగా బౌలింగ్ చేయగా, గుర్నూర్ బ్రార్ (2/27), రమందీప్ సింగ్ (2/23), మయాంక్ మార్కండే (1/26) వికెట్లు తీశారు. మధ్యప్రదేశ్ 31.2 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. రాజత్ పటీదార్ (38) మాత్రమే కొంత పోరాటం చేశాడు. ఈ విజయాలతో విదర్భ, పంజాబ్ విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి.