Let's talk: editor@tmv.in
“విజయ్ దివస్‌”- భారత్ విజయానికి ప్రతీక

“విజయ్ దివస్‌”- భారత్ విజయానికి ప్రతీక

Dantu Vijaya Lakshmi Prasanna
16 డిసెంబర్, 2025

భారతదేశంలో ప్రధానంగా రెండు 'విజయ్ దివస్‌'లను జరుపుకుంటారు. మొదటి విజయ్ దివస్‌ డిసెంబర్ 16 ఇది 1971 ఇండో పాక్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయాన్ని, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి గుర్తుగా చేసుకుంటే మరొకటి కార్గిల్ విజయ్ దివస్ జూలై 26 న 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయాన్ని గుర్తుచేసుకోవడానికి చేసుకుంటాం. ఈ రెండు రోజులూ భారత సైన్యం త్యాగాలను, దేశ గౌరవాన్ని స్మరించుకోవడానికి ఉద్దేశించినవే. మనం ఈ డిసెంబర్ 16న జరుపుకునే విజయ్ దివస్‌ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

డిసెంబర్ 16 మన హృదయాలలో ఒక అమూల్యమైన చెరగని జ్ఞాపకాన్ని గుర్తుచేసే రోజు. న్యాయం కోసం నిలబడి, శాంతి సమానత్వానికి నిదర్శనంగా యుద్ధం చేసిన భారత సైన్య౦ పట్ల గౌరవాన్ని ఈ రోజు ప్రతి భారతీయుడికి గుర్తుచేస్తుంది. యావత్ భారతావని పాకిస్థాన్ పై సాధించిన విజయానికి గుర్తుగా ఏటా భారత్ విజయ్ దివస్ ను జరుపుకుంటుంది. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఈ విజయం పాకిస్తాన్‌ తలపెట్టిన నిష్పక్షపాతానికి వ్యతిరేకంగా మానవత్వానికి ఓ పెద్ద గెలుపు. ఆ యుద్దం లో పోరాడిన సైనికవీరుల వీరత్వానికి నివాళులర్పిస్తూ, వారి త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ మనమంతా ఈ రోజు జరుపుకుంటున్నాం.

ఈ రోజు భారతదేశం విజయగాధను మాత్రమే గుర్తు చేయదు. మన వీరుల త్యాగం వల్ల మనము ఆత్మగౌరవంతో, దేశశాంతికి దేశభక్తితో ముందుకు నడుచుకు వెళ్తున్నామన్న భావనను కూడా జ్ఞాపకం చేస్తుంది. వీరందరి వీరత్వం మనకో ఒక కొత్త శక్తిని ఇస్తుంది. దేశానికి సేవ చేయడానికి, శాంతి కోసం నిలబడడానికి ఈ విజయం మనకో కొత్త ఆశను ఇచ్చే వెలుగుగా మారుతుంది. “విజయ్ దివస్” అన్న పదానికి అర్ధం “జయ దినం” లేదా “విజయ దినం” అని. భారత సైన్యం 1971లో జరిగిన ఇండో, పాకిస్థాన్ యుద్ధంలో గెలచిన దినంగా ఈ రోజు చరిత్రలో నిలిచిపోయింది. ఇది పాకిస్తాన్‌పై భారత సాయుధ బలగాలు సాధించిన చారిత్రక విజయానికి, ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ ఆవిర్భవించడానికి ప్రతీక.

విజయ్ దివస్ అంటే ..

'విజయ్ దివస్' అంటే విజయాన్ని సాధించిన రోజు. ప్రత్యేకంగా, ఇది 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధం ముగింపును అందులో భారతదేశం సాధించిన అపూర్వ విజయాన్ని సూచిస్తుంది. ఈ రోజున, భారత సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలు అకుంఠిత దీక్షను యావత్ దేశం స్మరించుకుంటుంది.

పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడం,ఎన్నికల ఫలితాలను పట్టించుకోకపోవడం కారణంగానే బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం జరిగింది. 1971 మార్చి 26న, తూర్పు పాకిస్తాన్ అధికారికంగా విడిపోవాలనే పిలుపునిచ్చింది. భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వారి స్వాతంత్ర పోరాటానికి మద్దతు ఇచ్చారు.

యుద్ధ ప్రారంభం:

1971 యుద్ధం భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక పోరాటం. ఇది డిసెంబర్ 3, 1971న పాకిస్తాన్ వైమానిక దళం 11 భారత వైమానిక దళ స్థావరాలపై ముందుస్తు వైమానిక దాడులు చేయడంతో ప్రారంభమైంది. ఫలితంగా, తూర్పు పాకిస్తాన్‌లోని బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో బెంగాలీ జాతీయవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడానికి భారత సైన్యం అంగీకరించింది. పాకిస్తాన్‌కు చెందిన జనరల్ యాహ్యా ఖాన్ నేతృత్వంలోని అణచివేత సైనిక పాలన తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పెద్ద ఎత్తున మారణహోమం నిర్వహించడం కారణంగా ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తూర్పు పశ్చిమ సరిహద్దుల్లో తక్కువ వ్యవధిలో తీవ్రంగా కొనసాగింది.

1971 డిసెంబర్ 4న భారతదేశం ఆపరేషన్ ట్రైడెంట్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో, భారత నౌకాదళం వెస్ట్రన్ నేవల్ కమాండ్ 'ట్రైడెంట్' అనే కోడ్ పేరుతో కరాచీ నౌకాశ్రయంపై విజయవంతంగా ఆశ్చర్యకర దాడి చేసింది. తూర్పు పాకిస్తాన్‌లో, ముక్తి బాహిని గెరిల్లా దళాలు తూర్పున ఉన్న పాకిస్తాన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడటానికి భారత దళాలతో చేతులు కలిపాయి. యుద్ధ సమయంలో, దక్షిణ కమాండ్ పాకిస్తాన్ నుండి ఎలాంటి చర్యలు జరగకుండా దేశ సరిహద్దులను రక్షించింది. దక్షిణ ఆర్మీ బాధ్యతాయుత ప్రాంతంలో జరిగిన యుద్ధాలలో లాంగేవాలా పర్బత్ అలీ వంటి ప్రసిద్ధ యుద్ధాలు ఉన్నాయి. ఇక్కడ, పాకిస్తాన్ సాయుధ దళాలు పట్టుదల కలిగిన భారత దళాలచే ధ్వంసం చేయబడ్డాయి.

లెఫ్టినెంట్ కల్నల్ (తరువాత బ్రిగేడియర్) భవానీ సింగ్ నేతృత్వంలోని ప్రసిద్ధ 10 పారా కమాండో బెటాలియన్ సైనికులు పాకిస్తాన్‌లోని చాచ్రో పట్టణంపై దాడి చేశారు. ఈ యుద్ధాలు చరిత్రలో ఒక ఉదాహరణగా నిలిచాయి. మన సైనికుల పట్టుదల, సంకల్పం ధైర్యసాహసాలను చూపుతాయి. డిసెంబర్ 14న, తూర్పు పాకిస్తాన్ గవర్నర్‌తో సమావేశం జరుగుతున్న ఒక ఇంటిపై ఐఏ ఎఫ్ దాడి చేసింది. ఈ దాడితో పాకిస్తాన్ కు విపరీతమైన నష్టం జరిగింది. ఫలితంగా, డిసెంబర్ 16, 1971న లొంగుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఆ సమయంలో దాదాపు 93,000 మంది పాకిస్తాన్ దళాలు లొంగిపోయాయి.

1971 యుద్ధం డిసెంబర్ 3న ప్రారంభమై కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ సైన్యం భారత సైన్యం ముందు లొంగిపోయింది. ఈ చారిత్రక విజయాన్ని జరుపుకోవడానికి, ఆ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు నివాళులు అర్పించడానికి ప్రతి సంవత్సరం 1972 నుండి ఈ రోజును 'విజయ్ దివస్'గా జరుపుకోవడం ప్రారంభించారు. విజయ్ దివస్ జరుపుకోవడానికి ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి:

1971 యుద్ధంలో చారిత్రక విజయం

1971లో, తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) ప్రజలపై పశ్చిమ పాకిస్తాన్ సైన్యం అమానుష దాడులకు పాల్పడింది. బెంగాలీ మాట్లాడే ప్రజలను అణచివేయడం, వారిపై మారణహోమం సృష్టించడం వంటి దురాగతాలు జరిగాయి. దీని ఫలితంగా దాదాపు కోటి మంది శరణార్థులు భారతదేశంలోకి వచ్చారు.

ఈ అమానవీయ పరిస్థితికి ముగింపు పలకడానికి, తూర్పు పాకిస్తాన్ ప్రజల స్వేచ్ఛ కోసం భారత ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. 13 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో భారత త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) అద్భుతమైన సమన్వయంతో పోరాడాయి. డిసెంబర్ 16న, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎ.ఎ.ఖాన్ నియాజీ 93,000 మంది సైనికులతో సహా భారత సైన్యం ముందు ఢాకాలో లొంగిపోయారు. ప్రపంచ యుద్ధ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సైన్యం లొంగిపోవడం అరుదైన సంఘటన. ఈ ఘన విజయం కారణంగానే ఈ రోజును జరుపుకుంటారు.

బంగ్లాదేశ్ ఆవిర్భావం

ఈ యుద్ధం తూర్పు పాకిస్తాన్‌కు విముక్తి కల్పించింది, ఫలితంగా బంగ్లాదేశ్ అనే స్వతంత్ర దేశం ఏర్పడింది. పొరుగు దేశానికి స్వేచ్ఛను అందించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది.

వీర జవాన్ల త్యాగానికి నివాళి

ఈ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వేలాది మంది భారత సైనికుల త్యాగాలను, ధైర్యసాహసాలను గౌరవించడానికి, వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడానికి విజయ్ దివస్ జరుపుకుంటారు. ఈ రోజున, దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి (నేషనల్ వార్ మెమోరియల్) వద్ద దేశ ప్రధానమంత్రి, రక్షణ మంత్రి త్రివిధ దళాధిపతులు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. దేశవ్యాప్తంగా సైనిక స్థావరాలు, పాఠశాలల్లో సైతం వీర జవాన్ల పరాక్రమాన్ని గుర్తుచేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 16న కేంద్ర రాష్ట్రస్థాయిలో వారిసైన్య స్మారకస్థళల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు.

1971 యుద్ధంలో విజయం భారత సైనిక సామర్థ్యాలు బలపరుచుకునేందుకు ఉపయోగపడింది. భారత చరిత్రలో ఒక ముఖ్య అధ్యయంగా నిలిచిపోయింది. వేడుకలు, కవాతులు తదితర కార్యక్రమాలు భారత్ అంతటా జరుగుతాయి. ముఖ్యంగా ఢిల్లీ, కోల్‌కతాలో విజయ్ దివస్‌ను ఘనంగా జరుపుకుంటారు.

విజయ్ దివస్ అనేది కేవలం ఒక విజయాన్ని మాత్రమే కాకుండా, మానవత్వం, ధైర్యం దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుంది.

“విజయ్ దివస్‌”- భారత్ విజయానికి ప్రతీక - Tholi Paluku